మళ్లీ ఫసల్‌ బీమా యోజన అమలు..!

వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకం(ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన-పీఎంఎఫ్‌బీవై) తెలంగాణలో తిరిగి అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated : 30 Mar 2024 04:56 IST

 ప్రతి సీజన్‌కు రాష్ట్ర వాటాగా రూ.1500 కోట్లు
  ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకం(ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన-పీఎంఎఫ్‌బీవై) తెలంగాణలో తిరిగి అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం 2016 నుంచి 2020 వరకు అమల్లో ఉండేది. తరువాత నాలుగేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి బీమా వర్తించడం లేదు. తాజాగా పీఎంఎఫ్‌బీవైని తిరిగి ఆచరణలో పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయశాఖ విధివిధానాలను రూపొందిస్తోంది. ఇందులో  బీమా ప్రీమియం చెల్లింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున నిధులను భరిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ప్రతి సీజన్‌కు రూ.1500 కోట్లు చొప్పున ఏటా రెండు సీజన్లకు కలిపి రూ.3 వేల కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇది అమలైతే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి భారం లేకుండా బీమా అందుతుంది.

భారీగా పెరిగిన ప్రీమియంలు

పంటల బీమాకు గతంతో పోలిస్తే ప్రీమియంలు పెరిగాయి. ప్రస్తుతం వానాకాలం పంటలకు 2%, యాసంగి పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియంను బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. పంట విత్తు నుంచి కోత వరకు ప్రకృతి విపత్తు కారణంగా ఏమైనా నష్టం వాటిల్లితే రైతుకు బీమా సొమ్ము అందుతుంది. కౌలుదారులతో సహా రైతులందరూ ఈ పథకం కింద కవరేజీ పొందడానికి అర్హులే.

రాష్ట్రం అంతటా ఒకే బీమా విధానం కాకుండా నదీ పరీవాహక ప్రాంతాలు, వర్షాధార పంటలు, సాగునీటి ఆధారిత పంట ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని ఏడు జోన్లుగా అమలు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. గోదావరి పరీవాహకం కింద ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో, కృష్ణా కింద మహబూబ్‌నగర్‌లో, ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతాలతోపాటు వరి, మొక్కజొన్న, పత్తి, పెసలు, వేరుసెనగ, శనగలు, కందులు, పసుపు, చెరకు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌ పంటలు పండే ప్రాంతాలకు వేర్వేరుగా ప్రీమియంలు ఉండాలని నివేదించింది.

నష్టం జరగకపోతే తిరిగిచ్చేలా..

ప్రీమియం చెల్లించినా ఏడాది మొత్తం పంటలకు ఎలాంటి నష్టాలు జరగని పక్షంలో బీమా కంపెనీలు భారీగా లబ్ధి పొందుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం మొత్తంలో కొంత ప్రభుత్వానికి తిరిగిచ్చే ప్రతిపాదన చేయాలని వ్యవసాయశాఖ నివేదించింది. దీనిపై ముందుగా కంపెనీలను ఒప్పించి.. తర్వాత పథకం అమలు చేయాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని