తాగునీటికి రూ.140 కోట్లు విడుదల

వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక దృష్టి సారించింది. విస్తృతస్థాయి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది.

Published : 30 Mar 2024 04:38 IST

వేసవిలో నీటిఎద్దడి లేకుండావిస్తృతస్థాయి కార్యాచరణ
ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం
కలెక్టర్లకు పూర్తిస్థాయి అధికారాలు
సీఎస్‌ రోజువారీ సమీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక దృష్టి సారించింది. విస్తృతస్థాయి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వేసవిలో తాగునీటి అవసరాలపై వ్యూహాత్మక విధానాన్ని అమలు చేస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి రోజువారీగా నీటి సరఫరాపై సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి అధికార యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వేసవి కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.140 కోట్లు విడుదల చేసింది. అవసరాల మేరకు కలెక్టర్ల వద్ద ఉన్న ప్రత్యేక నిధి నుంచి కూడా నిధులు వినియోగించుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చింది.

ప్రజల అవసరాలివీ..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవసరాలకు రోజుకు 4,400 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీ - మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీళ్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో 1,200; గ్రామీణ ప్రాంతాల్లో 3,200 ఎంఎల్‌డీ నీళ్లు అవసరం. సెంట్రల్‌ పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీపీహెచ్‌ఈఈవో) అంచనాల మేరకు ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో సగటున రోజుకు 70, పట్టణ ప్రాంతాల్లో 100-135 లీటర్ల నీళ్లు అవసరమని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈ మేరకు రాష్ట్ర అవసరాలకు తగినంత కంటే మించి తాగునీటి లభ్యత ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కొద్ది వారాలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రిజర్వాయర్లలో నీటిని సైతం పొదుపుగా వినియోగిస్తూ వస్తున్నారు. జులై చివరి వారం వరకు రాష్ట్రంలో నీటి కొరత వచ్చే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం ‘ఈనాడు’తో చెప్పారు. రాష్ట్రంలో పని చేయకుండా ఉన్న, గత కొన్నేళ్లుగా వినియోగించని బోర్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. తాగునీటి సరఫరా కోసం నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గడిచిన నెలల్లో నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో స్పష్టం చేశారు. నిర్వహణ కోసం ఎక్కడైనా విద్యుత్‌ను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆయా ప్రాంతాల పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా నీటి సరఫరా పరిస్థితిపై ప్రతి రోజూ సీఎస్‌కు జిల్లా కలెక్టర్లు నివేదికలు పంపేలా ఏర్పాట్లు చేశారు.

నిధుల కేటాయింపు..

ప్రస్తుత వేసవిలో తాగునీటి సరఫరా సాఫీగా సాగేందుకు ప్రభుత్వం పురపాలక శాఖకు రూ.40 కోట్లు, పంచాయతీలకు రూ.100 కోట్లు కేటాయించింది. రాష్ట్ర అవసరాల మేరకు సరఫరా చేసేందుకు రిజర్వాయర్లలో కూడా నీటి నిల్వలు తగినంత ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటి నుంచి తగిన రీతిలో నీటిని విడుదల చేసేందుకు ఇప్పటికే కార్యాచరణను సైతం రూపొందించారు. వచ్చే నెలలో కొన్ని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కర్ణాటకలో నెలకొన్న నీటి ఎద్దడితో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని ఓ అధికారి వివరించారు. పురపాలికలు, పంచాయతీల్లో డిసెంబరు నుంచే వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయినట్లు తెలిపారు. తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని