వేసవి భత్యం అందక ‘ఉపాధి’ కూలీల అగచాట్లు

కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం నిలిపివేయడంతో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల్లో ఆందోళన నెలకొంది. మండుటెండల్లో పనిచేసే వారికి సాంత్వన కలిగించేలా మొదటి నుంచీ ఉన్న వెసులుబాటును ఆపేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

Published : 30 Mar 2024 04:52 IST

కేంద్రం నిర్ణయంతో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం నిలిపివేయడంతో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల్లో ఆందోళన నెలకొంది. మండుటెండల్లో పనిచేసే వారికి సాంత్వన కలిగించేలా మొదటి నుంచీ ఉన్న వెసులుబాటును ఆపేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉపాధి హామీ పనులు వేసవిలో పూర్తి స్థాయిలో జరుగుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతలతో కూలీలకు శ్రమభారం ఎక్కువగా ఉంటుంది. మంచినీటి సరఫరాతోపాటు పరికరాలు, షేడ్‌నెట్లు సమకూర్చుకున్నందుకుగాను అద్దె రూపేణా కొంత మొత్తాలను ఇవ్వడంతో పాటు వేసవిలో వారు చేసిన పనికి 30 శాతం అదనపు భత్యాన్ని ఇచ్చే విధానం పథకం ప్రారంభమైనప్పటి నుంచీ అమల్లో ఉంది. కూలీలకు ప్రయాణ, కరవుభత్యం(టీఏ, డీఏ) ఖర్చు కింద గడ్డపారకి రూ.10, తట్టకు రూ.5, మంచినీటికి రూ.5, అయిదు కిలోమీటర్లకుపైగా దూరం నుంచి వచ్చే వారికి రూ.20 చొప్పున ఇవ్వాలి. దీంతోపాటు పనిప్రదేశంలో టెంట్‌ వేసి విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పించాలి. మార్చి నెల ఒకటో తేదీ నుంచీ వేసవిగా పరిగణించి ఈ భత్యాలను చెల్లించి, టీఏ, డీఏలను ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించాలి. ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. కొత్త సాఫ్ట్‌వేర్‌లో భత్యాల చెల్లింపులను అనుసంధానం చేయలేదు. దీంతో మార్చి ఒకటో తేదీ నుంచి భత్యాలు, టీఏ, డీఏలు అందడం లేదు. మెడికల్‌ కిట్లు, నెట్లు కూడా సమకూర్చడం లేదు.

తగ్గుతున్న హాజరు

రోజూ రూ.272 కూలిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి భత్యం, టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో రోజుకు రూ.175 మించి డబ్బు రావడం లేదు. గతంలో భత్యాలు ఉన్నందున వారు పరికరాలను ఇంటి నుంచి తెచ్చుకునే వారు. మంచినీటిని సమకూర్చుకునేవారు. ఆటోల ద్వారా ప్రయాణించి ఛార్జీ చెల్లించేవారు. ఇప్పుడు ప్రభుత్వ సాయం అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వేసవి భత్యాలు అందకపోవడంతో ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య 30 శాతం మేర తగ్గింది. అన్ని జిల్లాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. భత్యాల కోసం కూలీలు సిబ్బందిని నిలదీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని