‘అడుగంటిన’ ఆశలు

రాష్ట్రంలో చెరువులు ఎండిపోతున్నాయి. వర్షాభావానికి తోడు.. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో కాలువలకు వదలడం లేదు. దీంతో కొన్ని తటాకాలు నెర్రెలు బారుతున్నాయి.

Published : 31 Mar 2024 05:16 IST

రాష్ట్రంలో 50 శాతం చెరువుల్లో కానరాని నీటిజాడ
పంటలు కాపాడుకునేందుకు రైతుల తంటాలు
ప్రాజెక్టు కాలువల నుంచీ రాని జలాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చెరువులు ఎండిపోతున్నాయి. వర్షాభావానికి తోడు.. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో కాలువలకు వదలడం లేదు. దీంతో కొన్ని తటాకాలు నెర్రెలు బారుతున్నాయి. బోర్ల కింద సాగుచేసే రైతులు కూడా చివరి తడికి తంటాలు పడుతున్నారు. చెరువుల్లో జలకళ ఉంటేనే బోర్లలో నీరందుతుంది. రాష్ట్రంలో మొత్తం 34 వేలకు పైగా నీటి వనరులు ఉన్నాయి. 50 శాతం తటాకాలు పూర్తిగా ఎండిపోయాయి. 30 శాతం చెరువుల్లో అక్కడక్కడా గుంతల్లో తప్ప నీళ్లు లేవు. కేవలం 20 శాతం చెరువుల్లోనే కొంతమేర జలం ఉంది. వచ్చే మూడు నెలలు పశువులకు తాగు నీరు లభించడం కూడా కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కృష్ణా పరీవాహకంలో..

ఈ ఏడాది కృష్ణా పరీవాహకంలో వర్షాలు తక్కువగా కురిశాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల్లో చెరువుల్లోకి పెద్దగా నీరు చేరలేదు. ఈ జిల్లాల పరిధిలోని 12,894 చెరువుల్లో కేవలం 26 శాతం మాత్రమే పూర్తిస్థాయిలో నిండాయి. మరో 30 శాతం తటాకాలు 75 శాతం మేర నిండాయి. ఇప్పుడు కేవలం 10 శాతం చెరువుల్లోనే కొద్దిగా నీటి తడి కనిపిస్తోంది.

గోదావరి పరీవాహకంలో..

గోదావరి పరీవాహకంలో భారీ వర్షాలు నమోదైనప్పటికీ ఒక క్రమపద్ధతిలో కురవలేదు. తొలినాళ్లలో వర్షాలు లేకపోవడంతో పాటు.. వానాకాలం పంట చివరి తడికి బోర్లపై ఆధారపడాల్సి వచ్చింది. యాసంగికి వచ్చేసరికి రైతులు చాలా ప్రాంతాల్లో ఎద్దడి ఎదుర్కొంటున్నారు. 21,000 చెరువుల్లో ఈ ఏడాది 15 వేల చెరువులు మత్తడి పోశాయి. ప్రస్తుతం 30 శాతం చెరువుల్లో మాత్రమే కొంతమేర నీళ్లున్నాయి.

రాష్ట్రంలో ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ప్రాజెక్టుల కాలువలకు అనుసంధానించడం జరిగింది. ఏటా 7 వేల చెరువులను ఇలా నింపుతూ వస్తున్నారు. ఈ ఏడాది శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో మినహా ఎక్కడా నింపలేకపోయారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, జూరాల జలాశయాల నుంచి యాసంగి తొలి సీజన్‌లో ఒకటి రెండుసార్లు చెరువులను నింపినా ఫలితం లేకపోయింది.

రైతుల కష్టాలు: ప్రస్తుతం ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. యాసంగి పంటలు పొట్టదశలో ఉన్నందున రైతులు తడులకు అగచాట్లు పడుతున్నారు. సమీప వాగుల్లో చెలమలు తవ్వించి పంటలను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఒక్కో బోరుకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నెలరోజుల వ్యవధిలో 1506 కొత్త బోర్లు తవ్వించడం గమనార్హం.

ఆదుకోని కల్వకుర్తి ఎత్తిపోతలు

వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పరిధిలోని.. 18 మండలాల్లో 371 చెరువులను ఏటా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువతో నింపుతుండగా.. శ్రీశైలం జలాశయం వెలవెలబోవడంతో ఈ ఏడాది నీరివ్వలేదు. మొదట్లో ఈ చెరువుల్లోని జలాలను చూసి దాదాపు 76 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పుడు అనేక ప్రాంతాల్లో పంట చివరిదశలో నీటి ఎద్దడి ఏర్పడింది.


పంట చేతికిరావడం కష్టమే!

మా ఊరి చెరువు కింద 10 ఎకరాలు, 4 బోర్ల కింద మరో 10 ఎకరాల వరి సాగు చేశా. ఏటా ఏప్రిల్‌ చివరి వరకు కల్వకుర్తి ఎత్తిపోతల కాలువల కింద నీళ్లు వచ్చేవి. ఈ ఏడాది జనవరిలోనే ఆపేశారు. పంట చేతికిరావడం కష్టంగా మారింది. ఇంకో నెల ఎలా గడుస్తుందోనన్న బెంగ పట్టుకుంది.

మల్లెల కృష్ణారెడ్డి, మాదారం,
ఊర్కొండ మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని