పీవీకి భారత రత్న ప్రదానం

మాజీ ప్రధాని, రాజకీయ చాణక్యుడు, బహుభాషా కోవిదుడైన తెలుగుబిడ్డ పి.వి.నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను మరణానంతరం ప్రదానం చేశారు.

Published : 31 Mar 2024 05:16 IST

చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌, కర్పూరీ ఠాకుర్‌లకు కూడా
నేడు ఆడ్వాణీ నివాసానికి వెళ్లి అందించనున్న రాష్ట్రపతి

దిల్లీ: మాజీ ప్రధాని, రాజకీయ చాణక్యుడు, బహుభాషా కోవిదుడైన తెలుగుబిడ్డ పి.వి.నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను మరణానంతరం ప్రదానం చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు దీనిని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌లకు కూడా మరణానంతరం ప్రకటించిన ఈ పురస్కారాలను వారివారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. శనివారంనాటి కార్యక్రమంలో చరణ్‌సింగ్‌ తరఫున ఆయన మనవడు జయంత్‌ చౌధరి, స్వామినాథన్‌ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకుర్‌లు పురస్కారాలు అందుకున్నారు.

పురస్కార గ్రహీతల విజయాలను రాష్ట్రపతి భవన్‌ కొనియాడింది. స్వాతంత్య్ర ఉద్యమంలో, నిజాంలపై పోరులో కీలకపాత్ర పోషించిన పీవీ.. దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొంది. కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు- అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌రెడ్డి, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న పురస్కారాలు ప్రకటించింది. వారిలో మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీ ఒక్కరే జీవించి ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆడ్వాణీ వద్దకు రాష్ట్రపతితో పాటు, ప్రధాని మోదీ ఆదివారం వెళ్లి భారతరత్నను స్వయంగా ప్రదానం చేయనున్నారు.

పీవీ కృషి చిరస్మరణీయం: మోదీ

భారతరత్నాలు ఆయా రంగాల్లో చేసిన కృషిని మోదీ కొనియాడారు. ‘దేశ పురోగతి, ఆధునికీకరణకు పీవీ ఎంతో పాటుపడ్డారు. పండితునిగా, మేధావిగా ఆయనకెంతో పేరుంది. ఆయన కృషి చిరస్మరణీయం. పీవీకి భారతరత్న ఇవ్వడం అందరికీ గర్వకారణం’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో చరణ్‌సింగ్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం కర్పూరీ ఠాకుర్‌ అవిరళ కృషి చేశారని కొనియాడారు. జన్యుశాస్త్రం, వ్యవసాయ విజ్ఞానంలో స్వామినాథన్‌ చేసిన కృషికి భారతరత్న ప్రదానం చేయడం ద్వారా ఆహార భద్రత రంగంవైపు మరింతమందిని ఆకర్షితుల్ని చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు