కరెంటు కోతలు ఉండొద్దు

రాష్ట్రంలో అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.

Published : 31 Mar 2024 05:17 IST

తాగునీటి కొరతను అధిగమించాలి
వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావడంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందన్నారు. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలన్నారు. శనివారం సీఎం రేవంత్‌ సచివాలయంలో విద్యుత్‌, తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. రోజురోజుకూ ఎండల వేడి పెరుగుతున్నందున రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ ఎంత, సరఫరా ఎంత అనేది ప్రతిక్షణం పరిశీలిస్తూ ఉండాలని విద్యుత్‌ సంస్థలకు ఆదేశాలిచ్చారు.  గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా కరెంటు సరఫరాతో కొత్త రికార్డును నమోదు చేసినట్లు వివరించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చిలో డిమాండ్‌ గణనీయంగా పెరిగినా సరఫరా ఆగకుండా చూడటంలో డిస్కంలు సమర్థ పాత్ర పోషించాయని రేవంత్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఆయన అభినందించారు. రాష్ట్రంలో గత రెండు వారాలుగా రోజూ 14,000- 15,000 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ ఉంటోంది. ఈక్రమంలో వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా కరెంటు సరఫరా జరిగేలా చూడాలని చెప్పారు. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్‌ యూనిట్ల(మి.యూ) కరెంటు సరఫరా అయింది. ఈఏడాది అదేనెలల్లో సగటున రోజుకు 251.59 మి.యూ. సరఫరా చేసినట్లు సీఎం ప్రకటించారు. గత ఏడాది మార్చి 14న 297.89 మి.యూ. సరఫరా రికార్డు కాగా.. ఈఏడాది 308.54 మి.యూ.తో కొత్త రికార్డు నమోదైందని వివరించారు.

బోర్లు, బావుల నీటిని వాడుకోండి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ వరకు స్థానికంగా అందుబాటులో ఉన్న బోర్లు, బావులను తాగునీటి అవసరాలకు వాడుకోవాలని సూచించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్నచోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒకరిని ప్రత్యేక అధికారిగా నియమించాలన్నారు. వేసవి కోసం ప్రత్యేకంగా గ్రామాల వారీగా తాగునీటి సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అవసరాన్ని బట్టి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నీటి ట్యాంకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు నీటిట్యాంకరు కావాలని అడిగితే 12 గంటల్లోపు చేర్చేలా చూడాలన్నారు. అందుకు అవసరమైనన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని