ఇక ‘విశ్రాంతి’

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది.

Updated : 31 Mar 2024 05:04 IST

ముగిసిన వయోపరిమితి పెంపు గడువు
మూడేళ్ల తరువాత రిటైరవుతున్న ఉద్యోగులు
61 ఏళ్లు నిండిన వారికి వీడ్కోలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో అప్పట్లో రిటైరవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణలు మూడేళ్ల తర్వాత ఈ ఏడాది మొదలయ్యాయి. మార్చి 31 ఆదివారం కావడంతో మార్చి 30న శనివారం ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. శనివారం పలు కార్యాలయాల్లో రిటైరైన వారు చేసిన సేవలకు సంబంధిత విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 60 మంది, ఆర్టీసీలో 176 మంది, పోలీసుశాఖలో 100 మంది వరకు ఉద్యోగ విరమణ పొందారు.

రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, జీపీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రతినెలా ఇచ్చే పింఛను ఖరారు చేసి, మరుసటి నెల నుంచి మంజూరు చేయాలి. ఈ ప్రోత్సాహకాల కోసం పదవీ విరమణకు నెలరోజుల ముందు నుంచి ఉద్యోగులు దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తుంటారు. వీటిని ఏజీ కార్యాలయం ఆమోదించిన తరువాత విరమణ ప్రోత్సాహకాలు అందుతాయి. పింఛను మినహా ఇతర ప్రోత్సాహకాలు ఆలస్యమవుతున్నాయని కొందరు ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ చనిపోయిన వారి ప్రోత్సాహకాలు సైతం ఆర్నెల్లుగా అందలేదని వాపోయారు. ఎవరైనా ఉద్యోగి రిటైరైన రోజునే ప్రోత్సాహకాలన్నీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని