ఉపకార బకాయిలకు.. మరో మూడు నెలలు ఆగాల్సిందే

రాష్ట్రంలో ఉపకార వేతనాలు, బోధన ఫీజుల బకాయిల చెల్లింపులు ఆలస్యం కానున్నాయి. సంక్షేమశాఖలు దరఖాస్తులు పరిష్కరించి నిధులు మంజూరుచేసినా ట్రెజరీ ఆంక్షలతో నిలిచిపోయాయి.

Updated : 31 Mar 2024 04:45 IST

ట్రెజరీల్లో నిలిచిన రూ.2500 కోట్లు
నేటితో ముగియనున్న టోకెన్ల గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపకార వేతనాలు, బోధన ఫీజుల బకాయిల చెల్లింపులు ఆలస్యం కానున్నాయి. సంక్షేమశాఖలు దరఖాస్తులు పరిష్కరించి నిధులు మంజూరుచేసినా ట్రెజరీ ఆంక్షలతో నిలిచిపోయాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.2500 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించేందుకు ట్రెజరీశాఖ జారీ చేసిన టోకెన్ల గడువు ఈనెల 31తో ముగియనుంది. దీంతో గడువు మీరిన టోకెన్ల స్థానంలో కొత్తవాటిని జారీ చేసిన తరువాతే ఈ ఫీజు బకాయిలు విడుదల కానున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడం, నూతన ఆర్థిక సంవత్సరంలో నిధుల విడుదలకు కొంత సమయం పట్టనుండడంతో ఫీజు బకాయిల చెల్లింపులు మరో మూడు నెలల తరువాతే మొదలయ్యే అవకాశాలున్నట్లు సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం ఏటా సరాసరిన 12.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఈ మేరకు ప్రభుత్వం ఏటా రూ.2,400-2,450 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత మూడేళ్లుగా బకాయిలు క్రమంగా చెల్లించకపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరానికి కలిపి బకాయిలు రూ.5,600 కోట్లకు చేరుకున్నాయి. ఏటా సంక్షేమ శాఖలు దరఖాస్తులు పరిష్కరించి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తున్నాయి. అయితే నిధుల చెల్లింపులు ట్రెజరీల్లో నిలిచిపోతున్నాయి. ఆ విభాగం చెల్లింపుల కోసం టోకెన్లు జారీ చేస్తున్నా... నిధులు మాత్రం విడుదల కావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలుత రూ.1500 కోట్ల బోధన ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించేందుకు ఆగస్టు, సెప్టెంబరులో టోకెన్లు మంజూరయ్యాయి. అవి నేటికీ చెల్లుబాటు కాలేదు. ఇటీవల మరో రూ.వెయ్యి కోట్లకు టోకెన్లు ఇచ్చారు. ఇవన్నీ కలిపి దాదాపు రూ.2500 కోట్ల బకాయిల టోకెన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన టోకెన్లు మార్చి 31తో ముగుస్తాయి. శనివారం నాటికి ఈ టోకెన్ల నిధులు విడుదల కాలేదని సంక్షేమ వర్గాలు వెల్లడించాయి.

కల్యాణమస్తు, షాదీముబారక్‌ సహాయం ఆలస్యం..

కల్యాణమస్తు, షాదీ ముబారక్‌ పథకాల కింద లబ్ధిదారులకు సహాయం నిలిచిపోయింది. ఆర్డీవోలు పరిశీలించి పరిష్కరించిన దాదాపు 25 వేల దరఖాస్తులకు సంబంధించి రూ.250 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పథకం కింద లబ్ధికోసం ఇచ్చిన టోకెన్లు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని