సదస్సులతో న్యాయ వ్యవస్థ బలోపేతం

న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి న్యాయ సదస్సులు దోహదపడతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న అన్నారు.

Updated : 31 Mar 2024 04:41 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న

శామీర్‌పేట, న్యూస్‌టుడే: న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి న్యాయ సదస్సులు దోహదపడతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న అన్నారు. శనివారం శామీర్‌పేటలోని జస్టిస్‌ సిటీ నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో ‘న్యాయస్థానాలు-రాజ్యాంగం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సు ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పరిపాలన, పౌరుల హక్కులపై దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజ్యాంగ సమస్యలపై భిన్న దృక్పథాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాజ్యాంగ ఆదర్శాల సాధనలో న్యాయవ్యవస్థ ప్రస్థానాన్ని ఆమె వివరించారు. నోట్ల రద్దు, వివాహ సమానత్వం, పునరుత్పత్తి హక్కు, సీల్డ్‌ కవర్‌, ఎలక్టోరల్‌ బాండ్లు తదితర అంశాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుల గురించి ప్రస్తావించారు.

గవర్నర్‌ పదవి రాజ్యాంగ స్వభావాన్ని వివరించారు. న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ పాత్ర గురించి వివరించారు. ఈ సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్‌ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, ఉప కులపతి ఆచార్య శ్రీకృష్ణదేవరావు, భారత సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌, నేపాల్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సప్నా ప్రధాన్‌ మల్లా, పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌ మన్సూర్‌ అలీ షా, నల్సార్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.విద్యుల్లతారెడ్డి ప్రసంగించారు. వివిధ దేశాలకు చెందిన న్యాయ కోవిదులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని