వానాకాలం విత్తన ప్రణాళిక ఎప్పుడు?

రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి విత్తన ప్రణాళిక ఖరారులో కొంత జాప్యం నెలకొనడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు.

Published : 31 Mar 2024 03:12 IST

ఖరారులో జాప్యం.. రైతుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి విత్తన ప్రణాళిక ఖరారులో కొంత జాప్యం నెలకొనడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. సాధారణంగా ఏటా ఫిబ్రవరిలోనే ఈ ప్రణాళిక సిద్ధమవుతుండగా.. ఈసారి మార్చి నెలాఖరు వచ్చినా ఖరారు కాలేదు. వానాకాలం సీజన్‌లో పంటల సాగు కోసం వ్యవసాయ సమూహాల (క్లస్టర్ల) వారీగా వ్యవసాయ విస్తరణాధికారుల నుంచి సమాచారం సేకరించి, జిల్లాల్లో క్రోడీకరించి, రాష్ట్రస్థాయి ప్రణాళికను రూపొందించాలి. ఈ ప్రక్రియలో విత్తన ప్రణాళిక కీలకమైంది. ఏ జిల్లాలో ఎంతమేర ఏయే పంటలు సాగవుతాయి.. వాటికి ఎంతమేర విత్తనాలు అవసరం.. అనే విషయమై జిల్లాల వారీగా నివేదికలు ఇస్తే దాని ఆధారంగా రాష్ట్ర అధికారులు విత్తనాలను ఎలా సమకూర్చాలి? ఎలా పంపిణీ చేయాలనే దానిపై ప్రణాళికను సిద్ధం చేయాలి. విత్తనాల సమీకరణకు కంపెనీల వారీగా సమావేశాలు నిర్వహించి, పంపిణీ కోసం వాటికి దిశానిర్దేశం చేయాలి. అధిక ధరలకు విక్రయించకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ విధమైన కసరత్తు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

ఎందుకీ ఆలస్యం!

రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వ్యవసాయ శాఖ పరిధిలో రైతుభరోసా వంటి ప్రధాన పథకాల అమలుపై దృష్టి సారించింది. ఈ నెల 16 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో వానాకాలం సీజన్‌ ప్రణాళిక ఖరారులో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా వానాకాలం సీజన్‌లో దాదాపు 1.26 కోట్ల ఎకరాల మేర పంటలు సాగవుతున్నాయి. దీనికి అనుగుణంగా విత్తనాల పంపిణీ జరగాలి. వరి, పత్తి సాగు ఈ ఏడాది కూడా పెరిగే అవకాశం ఉంది. మిర్చి, జొన్న, పసుపు పంటలకు మంచి ధరలు వచ్చినందున వాటి సాగు కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు విత్తన ప్రణాళికను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో పత్తి, కరీంనగర్‌లో వరి, నిజామాబాద్‌లో జొన్న విత్తనాల ఉత్పత్తి భారీగా సాగుతోంది. అవసరాల మేరకు ఇది ఉందా లేదా అనే సమీక్ష జరగాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో కల్తీ విత్తనాల బెడద ఉంది. రబీ సీజన్‌లో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కల్తీ విత్తనాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని