కదలని ‘ధరణి’ దరఖాస్తులు

ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలతోపాటు సాధారణ అర్జీలు కూడా ముందుకు కదలడం లేదు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగానే ఏదీ పరిశీలించడం లేదంటూ చాలా జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం రైతులకు బదులిస్తోంది.

Published : 31 Mar 2024 03:12 IST

ప్రత్యేక డ్రైవ్‌కు ఎన్నికల కోడ్‌ అడ్డు
సాధారణ సమస్యలనూ పరిష్కరించని రెవెన్యూ యంత్రాంగం

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలతోపాటు సాధారణ అర్జీలు కూడా ముందుకు కదలడం లేదు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగానే ఏదీ పరిశీలించడం లేదంటూ చాలా జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం రైతులకు బదులిస్తోంది. ధరణిలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. 2.45 లక్షల వినతులను వెంటనే పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కారమవుతుందా.. లేదా అనేది స్పష్టంగా భూ యజమానులకు తెలియజేయాలని లక్ష్యం నిర్దేశించింది. 1.10 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేలోగా ఎన్నికల ప్రకటన జారీ అయింది. అయితే పాత దరఖాస్తులను కొత్తగా పరిశీలించాల్సిన అవసరం లేకున్నా ప్రత్యేక డ్రైవ్‌ పెట్టారని, దీన్ని కారణంగా తీసుకుని రెవెన్యూశాఖ అన్ని రకాల అర్జీలను పక్కన పెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, ఇనాం భూములకు నిలిచిన పట్టాల జారీ, తప్పుగా నమోదైన భూమి రకం(క్లాసిఫికేషన్‌) మార్పు వంటి సాధారణ సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని చెబుతున్నారు. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఎన్నికల నేపథ్యంలో నిర్వహించడం లేదు. దీంతో చాలామంది బాధితులు నేరుగా రాజధానికి వచ్చి సీసీఎల్‌ఏ లేదా ధరణి కమిటీ సభ్యులను కలిసి దరఖాస్తులు ఇస్తున్నారు. ఎన్నికల కోడ్‌ జూన్‌లో ముగుస్తుందని అప్పటి వరకు హక్కుల కోసం ఎలా ఆగాలని ప్రశ్నిస్తున్నారని ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమం మినహా ఇతర సమస్యలపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించవచ్చని సీసీఎల్‌ఏ వర్గాలు చెబుతుండగా జిల్లాల్లో మాత్రం అటు వైపు దృష్టి పెట్టడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని