మత్తు దందాపై ‘సఫేమా’ అస్త్రం

మత్తు దందాలో విక్రేతల అరెస్ట్‌తో వదిలేయకుండా మూలాల్లోకి వెళ్లి రవాణా లింకులను తెంచే దిశగా తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీఎస్‌న్యాబ్‌) కార్యాచరణ అమలు చేస్తోంది.

Published : 31 Mar 2024 03:13 IST

స్మగ్లర్ల ఆస్తుల జప్తుపై టీఎస్‌న్యాబ్‌ దృష్టి
రవాణా లింకులను తెంచేందుకు కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: మత్తు దందాలో విక్రేతల అరెస్ట్‌తో వదిలేయకుండా మూలాల్లోకి వెళ్లి రవాణా లింకులను తెంచే దిశగా తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీఎస్‌న్యాబ్‌) కార్యాచరణ అమలు చేస్తోంది. స్మగ్లర్ల ఆస్తుల జప్తులో నిమగ్నమైంది. ఇందుకోసం ‘స్మగ్లర్స్‌ అండ్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మానిప్యులేటర్స్‌ యాక్ట్‌(సఫేమా)ను ప్రయోగిస్తోంది. గతేడాది మే 31న బ్యూరో ఏర్పడినప్పటి నుంచి అధికారులు సుమారు రూ.4.36 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు. బ్యూరో ఏర్పడకముందు ఏదైనా ప్రాంతంలో మాదకద్రవ్యాలు దొరికినప్పుడు కేసు మాత్రమే నమోదయ్యేది. ఇతర కేసుల ఒత్తిడితో దర్యాప్తు పెద్దగా ముందుకు సాగేది కాదు. ప్రస్తుతం బ్యూరో ఆధ్వర్యంలో ఠాణాలవారీగా మాదకద్రవ్యాల కేసుల్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కేసుల్లో ప్రాథమిక ఆధారాన్ని పట్టుకొని కూపీ లాగుతున్నారు.

అంతర్జాతీయ లింకులు బహిర్గతం

మాదకద్రవ్యాల కేసుల్లో ప్రమేయమున్న డ్రగ్‌ ఫైనాన్షియర్స్‌, డీలర్స్‌, కింగ్‌పిన్‌లను పట్టుకోవడానికి బ్యూరో ప్రాధాన్యమిస్తోంది. ఇటీవలే పంజాగుట్ట ఠాణాలో దొరికిన స్టాన్‌లీ కేసే ఇందుకు ఉదాహరణ. బ్యూరో అధికారులు ఈ కేసు లోతుల్లోకి వెళ్లడంతో అంతర్జాతీయ లింకులు బహిర్గతమయ్యాయి. గోవా నుంచి దందా సాగిస్తున్న ఓక్రా లాంటి అంతర్జాతీయ స్మగ్లర్‌ను అరెస్ట్‌ చేయగలిగారు. ఎన్‌సీబీ, డీఆర్‌ఐ, కస్టమ్స్‌ తదితర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం ద్వారా బ్యూరో ఇలాంటి ఆపరేషన్లు చేపడుతోంది. అలాగే తెలంగాణలోకి దిగుమతి అవుతున్న మాదకద్రవ్యాలకు సంబంధించి ఓక్రాతోపాటు హనుమంతుబాబు, దివాకర్‌, స్వపన్‌దాస్‌, విశాల్‌, సర్ఫరాజ్‌లాంటి డ్రగ్‌ కింగ్‌పిన్‌ల పాత్రను బ్యూరో బహిర్గతం చేసింది. పారిస్‌, బెల్జియం నుంచి మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయని గుర్తించి వాటిపై నిఘా విస్తృతం చేయడం ద్వారా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈకేసుల్లో ప్రమేయమున్న 8 మంది విదేశీయులపై చర్యల కోసం ఎఫ్‌ఆర్‌ఆర్‌వోకు లేఖలు రాశారు. నలుగురు విదేశీయుల్ని వారి దేశాలకు తిప్పిపంపారు.

పార్టీల్లోనే డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్‌తో పరీక్షలు

బ్యూరో ఆవిర్భావం తర్వాత డ్రగ్స్‌ సరఫరాదారులనే కాకుండా వినియోగదారులను గుర్తించడం మొదలుపెట్టింది. మత్తు పార్టీలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లోకి బ్యూరో బృందాలు నేరుగా వెళ్లిపోతున్నాయి. డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ తీసుకెళ్లి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడం ఆరంభించాయి. ఇటీవలే ఓ రేవ్‌పార్టీలో 9 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు పాత నేరగాళ్లపై నిఘా విస్తృతం చేయడం సత్ఫలితాలిస్తోంది. ఇటీవలే నానక్‌రాంగూడలో వెలుగుచూసిన నీతూబాయి ఉదంతం ఇందుకు ఉదాహరణ. గతంలో వివిధ కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై నిఘా ఉంచగా మరోసారి గంజాయి విక్రయిస్తూ దొరికింది. ఆమెపై పీడీ యాక్ట్‌ ప్రయోగించేందుకు ప్రతిపాదించారు.

శిక్షణ... అవగాహన

2023లో నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌)యాక్ట్‌ కేసుల్లో 2,892 మంది నిందితులను అరెస్ట్‌ చేసినా కేవలం 14శాతం మందికే శిక్షలు పడ్డాయి. దర్యాప్తు అధికారులకు ఎన్‌డీపీఎస్‌ చట్టంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇలా కేసులు వీగిపోతున్నాయనే ఉద్దేశంతో శిక్షణపై బ్యూరో దృష్టి సారించింది. కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ వరకు 3,579 మందికి ఆఫ్‌లైన్‌లో.. 1,578 మందికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చింది. అలాగే 150 మంది ఎక్సైజ్‌ ఉద్యోగులకు.. 110 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు చట్టంపై అవగాహన కల్పించింది.


సమాచారమిస్తే రివార్డు
- సందీప్‌ శాండిల్య, డైరెక్టర్‌, టీఎస్‌న్యాబ్‌

మాదకద్రవ్యాల్ని అరికట్టడంలో పౌరులు భాగస్వాములు కావాలి. మాదకద్రవ్యాల రవాణా సమాచారమిస్తే రివార్డు ఇస్తాం. 100కిలోల కంటే ఎక్కువ గంజాయికి రూ.2లక్షల వరకు అందజేస్తాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. 87126 71111 నంబర్‌కు కాల్‌చేసి సమాచారం ఇవ్వొచ్చు. లేదా tsnabho-hyd@tspolice.gov.inకు మెయిల్‌ పంపొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని