రిజిస్ట్రేషన్ల రాబడి రూ.14,483 కోట్లు

ప్రభుత్వ ఖజానాకు ఆదాయపరంగా కీలకమైన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాబడుల్లో స్వల్పంగా వృద్ధి నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.14,483.05 కోట్ల రాబడి లభించింది.

Published : 01 Apr 2024 05:51 IST

2022-23 కంటే స్వల్ప వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఖజానాకు ఆదాయపరంగా కీలకమైన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాబడుల్లో స్వల్పంగా వృద్ధి నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.14,483.05 కోట్ల రాబడి లభించింది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగంతోపాటు ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్ల రాబడి కూడా దీనిలో ఇమిడి ఉంటుంది. 2022-23లో వచ్చిన రూ.14,291.04 కోట్లతో పోల్చితే రూ.192.01 కోట్లు పెరిగింది. అయితే సాగు భూముల కన్నా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లే ఆ శాఖకు దన్నుగా నిలిచాయి. 2022-23లో వీటి ద్వారా రూ.10,575.47 కోట్లు రాగా 2023-24లో రూ.11,162.49 కోట్లు వచ్చాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో స్థలాల క్రయవిక్రయాలు పెద్దఎత్తున జరిగాయి. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే రూ.587.02 కోట్ల పెరుగుదల నమోదైంది. భూములపైనే కాకుండా చిట్‌ఫండ్స్‌ రిజిస్ట్రేషన్ల సేవలు, ప్రత్యేక వివాహాలు, రిజిస్టర్‌ వివాహాలు, ఎన్‌కంబ్రెన్స్‌మెంట్లు, సర్టిఫైడ్‌ కాపీలు తదితర సేవల ద్వారా 2022-23లో రూ.1728.37 కోట్లు రాగా.. 2023-24లో రూ.78.32 కోట్లు పెరిగి రూ.1806.69 కోట్లు వచ్చింది.

సాగుభూముల క్రయవిక్రయాల తగ్గుదల

రాష్ట్రంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో సాగుభూముల క్రయవిక్రయాలు క్షీణించాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో పెట్టుబడులు తగ్గాయన్న అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌ శివారు జిల్లాల్లో ఫాం ల్యాండ్స్‌ విక్రయాలు మినహా ఇతర జిల్లాల్లో పొలాల అమ్మకాలు, కొనుగోళ్లు పెద్దగా చోటు చేసుకోలేదు. 2022-23లో 7.31 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1987.20 కోట్ల ఆదాయం వచ్చింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 5.91 దస్తావేజుల రిజిస్ట్రేషన్లే నమోదయ్యాయి. రాబడి రూ.1564.23 కోట్లు వచ్చింది. అంటే రూ.422.97 కోట్ల తగ్గుదల నమోదైంది.

ఈ ఆర్థిక సంవత్సరంపైనే ఆశలు..

2024-25 ఆర్థిక సంవత్సరంలో రాబడులు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి. గడిచిన ఏడాది ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఎన్నికలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉంటాయి. ఎక్కువ శాతం నాయకులు ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. దీంతో భూముల క్రయవిక్రయాలపై పెట్టుబడులు రాలేదు. దీంతోపాటు విదేశాలకు వెళ్లిన వారు ఆదాయంలో కొంత హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భూములపై పెడుతుంటారు. ఈ పెట్టుబడులు కూడా పెద్దగా రాలేదు. శాసనసభ ఎన్నికలు పూర్తవ్వడం.. లోక్‌సభ ఎన్నికలు మొదటి త్రైమాసికంలోనే ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ఖజానాకు రాబడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని