రైతులను అధోగతి పాల్జేసి పరామర్శలా?

ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా విపక్ష భారాస నేతలు చూపుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

Published : 01 Apr 2024 05:52 IST

భారాస నేతల మాయమాటలు ఎవరూ నమ్మరు
ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యాలుగా చూపుతున్నారు
ఏ ఒక్క రైతునూ నష్టపోనీయం: వ్యవసాయ మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా విపక్ష భారాస నేతలు చూపుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. వారు చేసిన నిర్వాకాలన్నింటినీ.. తమ ప్రభుత్వంపై నెట్టివేస్తున్నారని, అలాంటి చర్యలను రాష్ట్ర ప్రజలు హర్షించరని తెలిపారు. రైతులను అథోగతి పాల్జేసి, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పరామర్శకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. వారి మాయమాటలు నమ్మడానికి ఇప్పుడు ఏ తెలంగాణ రైతూ సిద్ధంగా లేరన్నారు. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి దాదాపు రూ.2500 కోట్లు రైతుల ప్రీమియం కూడా భరించి భవిష్యత్తులో ఏ ఒక్క రైతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోకూడదని దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఆదివారం తుమ్మల తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

‘‘మా ప్రభుత్వం వర్షాకాలం ముగిసిన తర్వాత డిసెంబరు 7వ తేదీన అధికారంలోకి వచ్చింది. నాగార్జునసాగర్‌లో నీళ్లులేని కారణంగా మొదటిపంటకే నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. కానీ రెండో పంటకు నీళ్లివ్వాలంటూ హేతుబద్ధత లేని డిమాండు చేస్తున్నారు. పక్క రాష్ట్రాలు నీటిని తరలిస్తున్నా.. కళ్లు మూసుకొని కూర్చున్నారు. నీటి నిర్వహణ మీద కనీస దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం ఇరుగుపొరుగు రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన దుస్థితికి భారాస ప్రభుత్వ వైఖరే కారణం. రైతుబంధు పేరిట విత్తన, ఇన్‌పుట్‌, యాంత్రీకరణ, డ్రిప్‌ స్ప్రింక్లర్ల మీద సబ్సిడీలన్నీ ఎత్తివేసి చిన్న, సన్నకారు రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది భారాస ప్రభుత్వమే. వారి పాలనలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఏఒక్క రైతునూ ఆదుకోలేదు. గోదావరి వరదల కారణంగా సర్వం కోల్పోయిన రైతులకు రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి మొండి చేయి చూపారు.

ఎన్నికలకు ముందు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించారు. మొదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా రూ.304 కోట్లకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ సొమ్ములు విడుదల చేయలేదు. మే నెలలో సంభవించిన పంట నష్టాన్ని కనీసం సర్వే చేయించలేదు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, భూసార సాంద్రత, జాతీయ ఉద్యాన పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకున్నారు. వ్యవసాయరంగమే కాదు, అన్ని వ్యవస్థలనూ కుప్పకూల్చి అవినీతిమయం చేశారు. ధాన్యం కొనుగోలులో బ్యాంకు గ్యారంటీలు విచ్చలవిడిగా ఇచ్చి.., ప్రభుత్వానికి రూ.50 వేల కోట్లు అప్పులు మిగిల్చారు. ఉచిత విద్యుత్‌ పేరిట అధిక ధరకు కరెంట్‌ కొనుగోలు చేసి రాష్ట్రంపై  వేల కోట్ల రూపాయలు భారం మోపారు. నిపుణులు, సహచరుల సూచనలు పెడచెవిన పెట్టి, నాణ్యతాప్రమాణాలు పాటించకుండా.. ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి రూ.వేల కోట్లు దుర్వినియోగం చేశారు’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని