ఎన్టీపీసీ ఒప్పందంతో భారం!

భవిష్యత్తులో ఖరీదైన థర్మల్‌ విద్యుత్‌ కొనుగోలు జోలికి వెళ్లకుండా సౌర, జల విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Published : 01 Apr 2024 05:52 IST

2,400 మెగావాట్ల ప్లాంట్‌ పూర్తయ్యేనాటికి యూనిట్‌ కరెంటు ధర రూ.9కి చేరుతుందని అంచనా
అంత ధరకు కొంటే డిస్కంలు నష్టపోతాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం
విద్యుదుత్పత్తి, కొనుగోళ్లపై కొత్త విధానం తయారీకి కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: భవిష్యత్తులో ఖరీదైన థర్మల్‌ విద్యుత్‌ కొనుగోలు జోలికి వెళ్లకుండా సౌర, జల విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ తెలంగాణ కోసం నిర్మించ తలపెట్టిన కొత్త 2,400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల ప్లాంట్‌ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4,000 మెగావాట్ల ప్లాంట్లను తెలంగాణ కోసం ఎన్టీపీసీ నిర్మించాల్సి ఉంది. ఇందులో 1,600 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణం చేపడతామని, పీపీఏ చేసుకోవాలని ఎన్టీపీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖలు రాసింది. ఆ ప్లాంట్‌ పూర్తయ్యేందుకు మరో ఐదేళ్లు పడుతుంది. అందులో 85 శాతం విద్యుత్‌ను రాష్ట్రానికి కేంద్రం ఇవ్వజూపుతోంది. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.5.90 చొప్పున ఎన్టీపీసీ పాత ప్లాంట్ల నుంచి కరెంటు లభిస్తోంది. కానీ కొత్త ప్లాంట్‌ పూర్తయ్యేసరికి యూనిట్‌ ధర   రూ.8 నుంచి రూ.9 వరకు చేరుతుందని అంచనాలున్నాయి. మరోవైపు సంప్రదాయేతర ఇంధనం ఒక్కో యూనిట్‌ రూ.2 నుంచి రూ.4 లోపు లభిస్తోంది. ఎక్కువ రేటు పెట్టి ఎన్టీపీసీ కొత్త ప్లాంట్‌ నుంచి కరెంటు కొంటే డిస్కంలు భారీగా నష్టపోతాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాబోయే పాతికేళ్ల పాటు కరెంటు కొంటామని కొత్త ప్లాంట్‌తో పీపీఏ చేసుకుంటే తెలంగాణ ప్రజలపై మోయలేనంత ఆర్థిక భారం పడుతుందని తేల్చింది.

కొత్త విద్యుత్‌ విధానంపై అసెంబ్లీలో బిల్లు

ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్‌ రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యాలతో కొత్త విద్యుత్‌ విధానంపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముసాయిదా బిల్లుపై వివిధ రంగాల నిపుణులు, ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ విచారణ కూడా నిర్వహించాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజ్‌ ప్రాజెక్టులతో నిరంతర కరెంటు సరఫరాకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

2032 నాటికి డిమాండు 27,059 మెగావాట్లకు

2031-32 నాటికి పెరిగే గరిష్ఠ డిమాండుకు అనుగుణంగా.. నిరంతర విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పనకు సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ డిమాండు గరిష్ఠంగా 15,623 మెగావాట్లు కాగా 2031-32 నాటికి 27,059 మెగావాట్లకు చేరుతుందని అంచనా. పదేళ్లుగా విద్యుత్‌ కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విద్యుత్‌ సంస్థలు దివాలా తీశాయని ప్రభుత్వం తేల్చింది. పెద్దఎత్తున సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరాకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించి ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సౌర విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా ఎంచుకుంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ ప్లాంట్లు నెలకొల్పాలని భావిస్తోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో తెలంగాణ జల విద్యుత్కేంద్రం!

రాష్ట్రంలో ఉన్న మేజర్‌, మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లతో పాటు నిర్మాణంలో ఉన్న వాటి పరిధిలో 6,732 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశాలున్నాయని విద్యుత్‌ సంస్థలు అంచనా వేశాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో జల విద్యుత్‌ ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి అక్కడ భారీ జలవిద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో హిమాచల్‌ప్రదేశ్‌  సీఎం సుఖ్విందర్‌ సింగ్‌తో దీనికి సంబంధించి సంప్రందింపులు జరిపినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని