అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Published : 01 Apr 2024 04:53 IST

ఏప్రిల్‌ 2 నుంచి.. వారానికి మూడు రోజులు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. వారానికి మూడు రోజుల చొప్పున మంగళ, గురు, శనివారాల్లో విమాన సదుపాయం ఉంటుందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఆదివారం వెల్లడించారు. అయోధ్యకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌-అయోధ్య మధ్య విమాన సర్వీసు ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆ లేఖకు జ్యోతిరాదిత్య స్పందించి విమానయాన సంస్థలతో మాట్లాడటంతో విమాన సర్వీసు అందుబాటులోకి వస్తోందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం లేదు. తాజాగా అందుబాటులోకి రానుండటంతో ప్రయాణం సులభతరం కానుంది. సమయమూ తగ్గనుంది. హైదరాబాద్‌-అయోధ్య నగరాల మధ్య విమాన సర్వీసును స్పైస్‌జెట్‌ నడపనుంది. ప్రయాణ సమయం 2 గంటలు. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకోనుంది. అవే రోజుల్లో అయోధ్య నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరి 3.25 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని