ఆర్టీసీ ‘గమ్యం’ తెలిసేది సగమే!

ఆర్టీసీ బస్సు ఎక్కడ ఉందో.. ఎప్పుడొస్తుందో తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ట్రాకింగ్‌ యాప్‌ ‘గమ్యం’ ప్రయాణికులకు అరకొరగానే ఉపయోగపడుతోంది.

Published : 01 Apr 2024 04:54 IST

సర్వీసు వివరాలు చిప్‌లో నమోదు చేయని సిబ్బంది
బస్సు ఎక్కడుందో తెలియక ప్రయాణికులకు ఇక్కట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు ఎక్కడ ఉందో.. ఎప్పుడొస్తుందో తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ట్రాకింగ్‌ యాప్‌ ‘గమ్యం’ ప్రయాణికులకు అరకొరగానే ఉపయోగపడుతోంది. ఈ యాప్‌ను ప్రారంభించి దాదాపు 8 నెలలు అవుతోంది. సెల్‌ఫోన్‌లో ‘గమ్యం’ యాప్‌ తెరిచి బస్సుల జాడ కోసం ప్రయత్నిస్తున్నవారికి పలు సందర్భాల్లో సమాచారం రావడం లేదు. డిపోల్లో కిందిస్థాయి సిబ్బంది బస్సుల్లో ఉండే చిప్‌లలో సర్వీసు రూట్ల వివరాలను నమోదు చేయడంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

నమోదు.. సగం కంటే తక్కువే

దూరప్రాంత బస్సులతో పాటు సిటీ బస్సుల జాడను తెలుసుకునేందుకు ‘గమ్యం’ యాప్‌ను ఆధునిక ఫీచర్లతో ఆర్టీసీ ఉన్నతాధికారులు తయారుచేయించారు. డిపో నుంచి బయల్దేరేటప్పుడు బస్‌లో ఉండే చిప్‌లో అది తిరిగే రూట్‌, సర్వీస్‌ నంబరు నమోదుచేయాలి. చిప్‌ జీపీఎస్‌తో అనుసంధానం ద్వారా ఆ బస్సు కదలికల్ని యాప్‌లో తెలుసుకోవచ్చు. తాము ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉంది.. ఎంత సమయంలో వస్తుంది.. తర్వాత బస్సు ఎప్పుడొస్తుంది.. వంటి వివరాలన్నీ ప్రయాణికులకు తెలిసే అవకాశం ఉంది. అయితే డిపోల్లో కిందిస్థాయి సిబ్బంది 30, 40 శాతం బస్సులకు మాత్రమే వాటి చిప్‌లలో రూట్ల నంబర్లను నమోదు చేస్తూ మిగిలిన బస్సుల్ని వదిలేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పని సవ్యంగా జరిగితే ప్రయాణికులకు బస్సుల రాకపై స్పష్టతతో పాటు.. ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయించకుండా సంస్థకు టికెట్ల రూపంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు సిబ్బంది నిర్లక్ష్యం ప్రయాణికులకు అసౌకర్యాన్ని, సంస్థకు నష్టాన్ని కలిగిస్తోంది.

జాడ తెలియక.. బస్సు ఆపక..

మరోవైపు ‘గమ్యం’ యాప్‌తో బస్సుల జాడ తెలియక బస్టాపుల్లో ఎదురుచూసే ప్రయాణికులకు మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లో సిటీ బస్సులను.. ముఖ్యంగా రాత్రివేళల్లో పలు బస్టాపుల్లో డ్రైవర్లు ఆపకుండానే వెళుతున్నారు. ట్రాఫిక్‌ సమస్యలతో రన్నింగ్‌ టైం చాలక, ఆలస్యాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొన్నిచోట్ల బస్సుల్ని ఆపకుండానే వెళ్లాల్సి వస్తోందని ఓ డ్రైవర్‌ ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని