శాసనసభలో రైతుబంధుపై చర్చ పెడతాం

భారాస సర్కారు రైతుబంధు పథకానికి సంబంధించి అనుసరించిన విధానాలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చ పెడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

Published : 02 Apr 2024 05:13 IST

ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నాక కొత్త విధానం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈటీవీ- ఖమ్మం: భారాస సర్కారు రైతుబంధు పథకానికి సంబంధించి అనుసరించిన విధానాలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చ పెడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సన్న, చిన్నకారు, మధ్యస్థాయి అన్నదాతలకు దక్కాల్సిన ‘రైతుబంధు’ను భారాస ప్రభుత్వం కోటీశ్వరులకు వర్తింపజేసి రూ.వేల కోట్లు అప్పనంగా కట్టబెట్టిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుబంధుపై శాసనసభ సమావేశాల్లో చర్చ పెట్టి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించాక వానాకాలం పంటల నాటికి కొత్త విధానం రూపొందిస్తామని చెప్పారు. పంటలు సాగుచేసే రైతులకే ‘రైతుబంధు’ అందాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇప్పటివరకు ఐదెకరాల వరకు భూమి ఉన్న 64.75 లక్షల మంది రైతులకు రూ.5,575.77 కోట్ల పెట్టుబడి సాయం అందించామని వెల్లడించారు. మిగిలిన వారికి ఈనెలాఖరులోపు అందిస్తామని తెలిపారు. భారాస హయాంలో మే నెలాఖరు వరకు యాసంగి ‘రైతుబంధు’ సాయం అందించేవారని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే పూర్తి చేస్తుందన్నారు. రైతు రుణమాఫీపై సర్కారు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని.. రిజర్వ్‌ బ్యాంకు, బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపా మధ్యే పోరు ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్‌ 12కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని మూడు నెలల్లో వైరా అనుసంధాన కాల్వ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని