వ్యాట్‌ ఎగవేత నెలకు రూ.200 కోట్లపైనే?

విదేశాల నుంచి మద్యం దిగుమతుల పేరుతో భారీ కుంభకోణం జరిగిందా? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం తెప్పించి ‘విలువ ఆధారిత పన్ను’(వ్యాట్‌) చెల్లించకుండానే అధిక ధరలకు అమ్మేసుకున్నారా?

Updated : 02 Apr 2024 07:00 IST

విదేశీ మద్యం సరఫరాలో అక్రమాలు
బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచే అవకతవకలు
ప్రభుత్వానికి నివేదించిన వాణిజ్య పన్నులశాఖ!

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల నుంచి మద్యం దిగుమతుల పేరుతో భారీ కుంభకోణం జరిగిందా? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం తెప్పించి ‘విలువ ఆధారిత పన్ను’(వ్యాట్‌) చెల్లించకుండానే అధిక ధరలకు అమ్మేసుకున్నారా? తనిఖీల అనంతరం వాణిజ్య పన్నులశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బట్టిచూస్తూ ఆ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. కొందరు నాయకులు, ఎక్సైజ్‌ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీసీఎల్‌) నుంచే ఈ అవినీతి తంతును సాగించారని వాణిజ్య పన్నులశాఖ ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ఈ అక్రమాల వల్ల మద్యం సీసాల ధరలను వ్యాపారులు ఇష్టారీతిగా నిర్ణయించి వినియోగదారుల నుంచి వసూలు చేసుకున్నారని, ప్రాథమిక అంచనాల మేరకు నెలకు రూ.200 కోట్ల వ్యాట్‌ ఎగవేతలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొందని తెలిసింది. ఇప్పటికైనా బీసీఎల్‌ నుంచి దుకాణాలకు సరఫరా అవుతున్న ప్రతి మద్యం సీసా ధర ఎంత, ఎక్సైజ్‌ సుంకం ఎంత, మొత్తం విలువపై చెల్లించే వ్యాట్‌ ఎంత అనేది ముద్రించకపోతే ఈ అవినీతి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఈ శాఖ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్టు సమాచారం.

వాస్తవంగా జరగాల్సింది ఇలా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని వ్యాపారి, ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థ విదేశీ మద్యం దిగుమతి చేసుకున్న పక్షంలో అది నేరుగా తొలుత బీసీఎల్‌ గోదాములకు రావాలి. మద్యం సీసాల ధరలను బీసీఎల్‌ నిర్ధారించిన తరవాత దానిపై ఎక్సైజ్‌ సుంకాన్ని కలిపి మొత్తం ధరను సీసీపై నమోదుచేయాలి. ఆ ధరపై మరో 70 శాతం సొమ్మును వ్యాట్‌ కింద వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు బీసీఎల్‌ జమచేయాలి. ఆ ప్రకారం ఒక మద్యం దుకాణదారు తనకు విదేశీ మద్యం ఎంత కావాలో వివరిస్తూ తొలుత బీసీఎల్‌కు ఆర్డర్‌ ఇచ్చి, దాని విలువ సొమ్మును డిమాండు డ్రాఫ్ట్‌(డీడీ) లేదా చలానా రూపంలో బీసీఎల్‌కు చెల్లించాలి. ఆ సొమ్ములో సదరు వ్యాపారి అడిగిన మద్యం విలువను లెక్కగట్టి ..అందులోనే ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ మినహాయించుకుని మిగిలిన డబ్బుకు మాత్రమే మద్యం సీసాలను బీసీఎల్‌ దుకాణదారుకు పంపాలి.

లక్ష్యం నెరవేరలేదు...

మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023-24)తో రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్‌ సుంకం కింద రూ.19,884 కోట్ల రాబడి సమకూరుతుందని బడ్జెట్‌లో అంచనా వేయగా, తొలి 11 నెలల్లో (గత ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి) అందులో 95.19 శాతం(రూ.18,927.79 కోట్లు) వచ్చింది. వ్యాట్‌ కింద రూ.39,500 కోట్లు వస్తుందని అంచనా వేయగా, ఇదే 11 నెలల్లో కేవలం 69.54 శాతం(రూ.27,467.35 కోట్లు) మాత్రమే వచ్చినట్లు కాగ్‌ ఆడిట్‌లో తేలడం మోసాలకు మరో నిదర్శనమని, లోతుగా విచారణ జరిపితే మరిన్ని మోసాలు వెలుగుచూడటంతోపాటు లోపాలను సరిదిద్దితే భవిష్యత్తులో ప్రభుత్వానికి మద్యంపై ఆదాయం భారీగా పెరుగుతుందని ఈ శాఖ వివరించింది.


మోసాలు జరిగింది ఇలా..

విదేశీ మద్యం సీసాపై ఎక్సైజ్‌ సుంకం మాత్రం వసూలు చేసుకుంటున్న ఎక్సైజ్‌ శాఖ వ్యాట్‌కు వసూలును పట్టించుకోలేదు. బీసీఎల్‌ కూడా సంబంధిత లెక్కలు చెప్పలేదని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. సంబంధిత బిల్లులనూ నివేదికకు జతచేసింది. అందులో ఓ బిల్లును ‘ఈనాడు’ సేకరించింది. ఆ ప్రకారం.. ‘సెక్స్‌టన్‌ సింగిల్‌ మాల్ట్‌ ఐరిష్‌ విస్కీ’ అనే బ్రాండు పేరు గల 700 మిల్లీలీటర్ల విదేశీ మద్యం సీసా ధర రూ.8,183.50గా బీసీఎల్‌ డిపో ఇచ్చిన బిల్లులో రాశారు. ఈ బ్రాండు సీసాలు ఆరు ఇచ్చామని, మొత్తం రూ.49,101 అయినట్లు బిల్లులో నమోదు చేశారు. దీనిపై ఎక్సైజ్‌ సుంకం వసూలుచేసిన బీసీఎల్‌, అదనంగా చెల్లించాల్సిన 70 శాతం వ్యాట్‌ను వదిలేయడం గమనార్హం. ‘ఇది వసూలుచేశారా, చేస్తే ప్రభుత్వానికి జమచేస్తారా లేదా అనే వివరాలూ ఎక్కడా లేవు. ఒక దుకాణానికి విదేశీ మద్యం తీసుకెళుతున్న వాహనాన్ని ఇటీవల తనిఖీ చేయగా, ఆ సరకుకు వ్యాట్‌ వసూలుచేయలేదని తేలింది’ అని వాణిజ్య పన్నులశాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ‘అలాగే నగర శివారు పేట్‌బషీరాబాద్‌లోని ఒక దుకాణానికి విదేశీ, స్వదేశీ మద్యం కావాలంటూ వ్యాపారి రూ.6 లక్షలు డీడీ రూపంలో చెల్లించారు. ఈ సొమ్ములో రూ.29,040 ఎక్సైజ్‌ సుంకం కింద మినహాయించుకుని మిగిలిన సొమ్ముకు 18 రకాల మద్యం సీసాలను బీసీఎల్‌ మేడ్చల్‌ డిపో నుంచి సరఫరా చేశారు. వ్యాపారికిచ్చిన బిల్లులో అతను ఎంత సొమ్ము చెల్లించారు, మద్యం సీసాల ధర ఎంత, దానిపై ఎక్సైజ్‌ సుంకం ఎంత అనే వివరాలు మాత్రమే ఉన్నాయి. 70 శాతం వ్యాట్‌ వసూలు చేశారా లేదా అనేది నమోదు చేయలేదని’ ఆ శాఖ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. అలా మద్యం సీసాల ధర, ఎక్సైజ్‌ సుంకం మాత్రమే తీసుకుంటూ వ్యాట్‌ను పట్టించుకోకుండా వదిలేస్తున్నందున ఖజానాకు నెలకు రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు వాణిజ్య పన్నులశాఖ ఆధారాలతో నివేదించినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని