7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 7,149 యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు పౌరసరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.

Updated : 02 Apr 2024 05:27 IST

అన్నింట్లో మద్దతు ధర చెల్లింపులకు ఏర్పాట్లు
సమస్యలపై ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబరు
పౌరసరఫరాల కమిషనర్‌ వెల్లడి

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 7,149 యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు పౌరసరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ సీజన్‌లో 75.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2,183, గ్రేడ్‌-1 రకానికి రూ.2,203 చొప్పున మద్దతు ధరలను కేంద్రాల్లో చెల్లిస్తామని చెప్పారు. సరైన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి, మద్దతు ధరలు పొందాలని రైతులకు సూచించారు. రైతులకు మద్దతు ధరలు దక్కేలా కొనుగోళ్లు జరగాలని, ఈ ప్రక్రియలో ఎక్కడా దళారులను రానీయవద్దని కేంద్రాల సిబ్బంది, అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. తూకంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వవద్దని, తరుగు పేరిట రైతులకు నష్టం కలగనీయవద్దని ఆదేశించామన్నారు. రైస్‌ మిల్లర్లుగానీ, వ్యాపారులుగానీ గరిష్ఠ మద్దతు ధరల కంటే తక్కువకు కొనుగోళ్లు జరిపేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ నంబరు 1967 లేదా 180042500333కి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.

పెరిగిన కేంద్రాలు

గత ఏడాది 7,037 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈసారి 7,149కి పెంచారు. కొనుగోళ్లు త్వరతగతిన జరిగేందుకు, అన్నదాతలకు సమీపంలో ఉండేందుకు వీలుగా ఎక్కువ కేంద్రాలు ఏర్పాటుచేశామని, రైతులు నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని పౌరసరఫరాల కమిషనర్‌ కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని