హైవేలపై కొత్త టోల్‌రేట్లు ఎన్నికల తర్వాతే: ఈసీ

జాతీయ రహదారులపై వాడుక రుసుములు (టోల్‌ రేట్లు) పెంచే ప్రతిపాదనను లోక్‌సభ ఎన్నికల తర్వాతే అమలు చేయాలని ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది.

Published : 02 Apr 2024 03:09 IST

దిల్లీ: జాతీయ రహదారులపై వాడుక రుసుములు (టోల్‌ రేట్లు) పెంచే ప్రతిపాదనను లోక్‌సభ ఎన్నికల తర్వాతే అమలు చేయాలని ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది. ఏటా ఏప్రిల్‌ ఒకటి నుంచి సగటున 5% చొప్పున ఈ రుసుం పెంచుతున్నారు. తాజా ప్రతిపాదనపై కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ వినతి మేరకు ఈసీ స్పందించింది. కొత్త రుసుములు ఎంత ఉండాలనే లెక్కల్ని ‘భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ’ (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించుకోవచ్చని, వాటిని   సార్వత్రిక ఎన్నికల తర్వాతే వర్తింపజేయాలని సోమవారం స్పష్టంచేసింది. ‘‘విద్యుత్తు రుసుముల నిర్ణయ ప్రక్రియను రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ కమిషన్లు కొనసాగించుకోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాకే వాటిని అమలు చేయాలి. ఆ కోణంలోనే హైవేల టోల్‌రేట్లనూ చూడాలి’’ అని రోడ్డు రవాణా శాఖకు ఈసీ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా చేసుకుని టోల్‌ ధరల్ని ఏటా సవరిస్తుంటామని ఎన్‌హెచ్‌ఏఐ    సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. సవరించిన ధరల్ని ప్రచురించవద్దని ఎన్‌హెచ్‌ఏఐని ‘జాతీయ రహదారుల బిల్డర్ల సమాఖ్య’ (ఎన్‌హెచ్‌బీఎఫ్‌) కోరింది.

వసూలు చేసిన మొత్తాలు వెనక్కి

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: టోల్‌రేట్ల విషయంలో టోల్‌ప్లాజా నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు అందలేదు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై పాత టోల్‌ రుసుములనే వసూలు చేయగా, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త రుసుములు వసూలు చేశారు. ఈ అదనపు మొత్తం ఆయా వాహనదారుల ఫాస్టాగ్‌ బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుందని, ఆ మేరకు వారి మొబైల్‌ ఫోన్‌కు సందేశం వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ పీడీ నాగేశ్వర్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని