అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫార్సు చేశారు?

‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) అంచనాలో అదనపు టీఎంసీ పనికి ఆస్కారం లేదు.

Updated : 02 Apr 2024 05:24 IST

ఏ అధికారం కింద అలా వ్యవహరించారు?
‘మేడిగడ్డ’పై మాజీ ఈఎన్సీకి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రశ్నల వర్షం
 రికార్డులు పరిశీలించి తర్వాత చెప్తానన్న వెంకటేశ్వర్లు 

ఈనాడు, హైదరాబాద్‌: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) అంచనాలో అదనపు టీఎంసీ పనికి ఆస్కారం లేదు. అదనపు టీఎంసీ సివిల్‌ పనులకు మాత్రం  అంచనాలు తయారు చేశాం’  అని ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు చెప్పారు. ఏ అధికారం కింద అలా సిఫార్సు చేశారని విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా, ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనని, రికార్డులు పరిశీలించి తర్వాత చెప్తానని పేర్కొన్నట్లు తెలిసింది. ఒకవైపు సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపి ఇంకోవైపు డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందని, గుత్తేదారుకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇమ్మని ఎలా సిఫార్సు చేశారని ప్రశ్నించగా, ఎస్‌ఈ నివేదిక ఆధారంగా ఉన్నత స్థాయి కమిటీకి పంపానని చెప్పినట్లు తెలిసింది. పలు నిర్ణయాలకు కింది ఇంజినీర్ల నివేదికలే ఆధారమని పేర్కొన్నారని, అనేక అంశాలకు తర్వాత సమాధానం ఇస్తానని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. ఈ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లను విచారిస్తోంది. కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లును రెండు రోజుల క్రితం విచారించగా, మిగిలిన ఇంజినీర్లను కూడా త్వరలోనే విచారించనుంది. వెంకటేశ్వర్లుకు 30కి పైగా ప్రశ్నలు సంధించింది. ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభంతో పని పూర్తయినట్లు భావిస్తున్నారా అని విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా.. లేదని ఈఎన్సీ సమాధానమిచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టడానికి సంబంధించిన సమాచారం కూడా అధికారులు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 8న ఆయనను మళ్లీ విచారణకు రావాలని పిలిచినట్లు తెలిసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం విజిలెన్స్‌ అధికారుల ప్రశ్నలు, ఈఎన్సీ జవాబుల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

విజిలెన్స్‌: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలించి తనిఖీ నోట్స్‌ ఏమైనా ఇచ్చారా?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: తనిఖీ చేశా. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత ఇస్తా.

విజిలెన్స్‌: మీ విజ్ఞప్తి మేరకే సీడీవో చీఫ్‌ ఇంజినీర్‌ పియర్స్‌ డ్రాయింగ్స్‌ సవరించారు. ఆర్‌సీసీ ఎం25-40 ఎం.ఎస్‌.ఎ.కు బదులుగా ఎం25-20 ఎం.ఎస్‌.ఎ.గా మార్చారు. ఈ మార్పును పియర్స్‌ పని ప్రారంభించక ముందే హైపవర్‌ కమిటీ ర్యాటిఫికేషన్‌ తీసుకోవాలని సీడీవో సూచించింది కదా?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: ప్రస్తుతం ఆ వివరాలు గుర్తులేవు. తర్వాత అందజేస్తా.

విజిలెన్స్‌: పనిలో సౌలభ్యం కోసం సీకెంట్‌ పైల్స్‌ పద్ధతి అనుమతించాలని గుత్తేదారు కోరారు. ఈ ప్రతిపాదనను సీడీవో చీఫ్‌ ఇంజినీర్‌కు పంపే ముందు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏమైనా చేశారా?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: చేశాం. ఆర్థిక భారంపై కూడా విశ్లేషించాం. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత సమర్పిస్తా.

విజిలెన్స్‌: నాటి సీఎం ప్రాజెక్టును పరిశీలించినపుడు ఆదేశించారని బ్యారేజీ ఎగువన, దిగువన సీసీ బ్లాకుల సైజులో మార్పు చేశారు. కొత్త సైజు సీసీ బ్లాకులకు సిఫార్సు చేసే ముందు దీన్ని బలపరిచేలా మోడల్‌ స్టడీస్‌/టెక్నికల్‌ స్టడీస్‌ చేశారా?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: ఇందుకోసం ఎలాంటి మోడల్‌ స్టడీస్‌ చేయలేదు.

విజిలెన్స్‌: ఆమోదించిన డ్రాయింగులకు అనేక సార్లు సవరణలు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులు చేసే ముందు కొన్నింటికి ఆర్థికంగా అధ్యయనం, కొన్నింటికి మోడల్‌ స్టడీస్‌ అవసరం. కానీ ఇలాంటివేమీ లేకుండా సిఫార్సు చేయడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమైంది కదా?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: ఆమోదించిన ప్రతి డ్రాయింగు సవరణకు మోడల్‌ స్టడీస్‌ చేయాల్సిన అవసరం లేదు.

విజిలెన్స్‌: 2020 ఫిబ్రవరి 20న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని రూ.3,260 కోట్ల నుంచి రూ.4,613 కోట్లకు పెంచి సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం 2021 సెప్టెంబరు 6న సవరించిన అంచనాకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర ప్రత్యుత్తరాల్లో డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ 2020 ఫిబ్రవరి 29న ప్రారంభమైందన్నారు. సవరించిన అంచనాకు సిఫార్సు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందని ఎలా చెప్పారు?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందన్నారు. దాన్నే నేను రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీకి నివేదించా. 2019 సెప్టెంబరు 9న చాలా వరకు పని పూర్తయిందని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పేర్కొన్న దానిపై ఎస్‌ఈ కౌంటర్‌ సంతకం చేసిన సర్టిఫికేట్‌పై నాకు అవగాహన లేదు. 2021 మార్చి 15న పని పూర్తయిందని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పేర్కొన్న దానిపై ఎస్‌ఈ కౌంటర్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మా కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగిన తర్వాతనే ఈ సమాచారం తెలిసింది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జారీ చేసింది పని పూర్తయినట్లుగా ఇచ్చిన సర్టిఫికేట్‌ కాదు. అనుభవానికి సంబంధించినది మాత్రమే.

విజిలెన్స్‌: పని పూర్తి కాకుండానే బ్యాంక్‌ గ్యారంటీ విడుదల చేయాలని ఎలా సిఫార్సు చేశారు?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ సిఫార్సు మేరకే స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టా.

విజిలెన్స్‌: త్రీడీ మోడల్‌ స్టడీస్‌ ప్రకారం బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం ప్రారంభించే ముందు 88 మీటర్ల మట్టం వరకు ఏమీ అడ్డంకులు లేకుండా అంతా ఒక లెవల్‌లో ఉండేలా చూడాలి కదా?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు: నీటిని నిల్వ చేయమని రాతపూర్వకంగా నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

విజిలెన్స్‌: బ్యారేజీ ప్రారంభించిన తర్వాత కాఫర్‌ డ్యామ్స్‌, డీవాటరింగ్‌, అదనపు లీడ్‌కు సంబంధించి ఒప్పందంలోని నిబంధనలకు సవరణలు ప్రతిపాదించారు. 2017 ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు చేస్తే.. 2018 ఏప్రిల్‌లో పంపిన రివైజ్డ్‌ ఎస్టిమేట్‌-1లో కాకుండా బ్యారేజీ ప్రారంభించిన తర్వాత రివైజ్డ్‌ ఎస్టిమేట్‌-2లో ఎందుకు పంపారు?

ఈఎన్సీ వెంకటేశ్వర్లు:  నాటి ముఖ్యమంత్రి సిఫార్సులను పరిగణనలోకి తీసుకొన్నది వాస్తవం.ఈ ఆదేశాలు మొదటి రివైజ్డ్‌ ఎస్టిమేట్‌కు ముందే ఇచ్చినా అప్పుడు కాకుండా రివైజ్డ్‌ ఎస్టిమేట్‌-2లో పంపడానికి కారణాలు తెలపడానికి సమయం కావాలి. అప్పటి సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌తో చర్చించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని