ప్రభాకర్‌రావు చుట్టూనే..!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ఐజీగా, ఆ తర్వాత ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

Updated : 02 Apr 2024 06:51 IST

భారాస అసమ్మతివర్గీయులు, ప్రతిపక్ష నేతలపై నిఘాకే ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం’ ఏర్పాటు
ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందినవారి డబ్బు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది
రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ఐజీగా, ఆ తర్వాత ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి ప్రతిపక్ష నేతలతోపాటు అధికార పార్టీలోని అసమ్మతివర్గీయులపై నిఘా పెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు.. దీనికి ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం’ అని పేరు పెట్టినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడైంది. సామాజికవర్గం ప్రాతిపదికన సస్పెండెడ్‌ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఏరికోరి దీని బాధ్యతలు అప్పగించినట్లు బహిర్గతమైంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందిన డబ్బును పట్టుకున్నట్లు కూడా తేలింది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌   డీసీపీగా, ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్‌రావు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత గురువారం అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

ఎస్‌ఐబీ విధానాలకు విరుద్ధంగా ప్రత్యేక బృందం..

2014లో భారాస(అప్పటి తెరాస) తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజికవర్గ సమీకరణాల మేరకు 2016లో ప్రభాకర్‌రావును నిఘా విభాగానికి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆయన తన సామాజికవర్గానికే చెందిన వారితోపాటు గతంలో తనతో కలిసి పనిచేసిన వారిలో కొందర్ని నిఘా విభాగంలోని వేర్వేరు ఉప విభాగాల్లో నియమించారు. వీరిలో నల్గొండ జిల్లా నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ కమిషనరేట్‌ నుంచి భుజంగరావు, సైబరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి తిరుపతన్న తదితరులు ఉన్నారు. వీరందరితో ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం’ ఏర్పాటు చేశారు. దీని నాయకత్వ బాధ్యతను ప్రణీత్‌రావుకు అప్పజెప్పారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, సొంత పార్టీలోని తిరుగుబాటుదారులపై నిఘా పెట్టడమే ఈ బృందం ఏర్పాటు ఉద్దేశం. ఎస్‌ఐబీ విధానాలకు ఇది పూర్తిగా విరుద్ధం.

రాధాకిషన్‌రావు సూచనతో ఎస్‌ఐబీలోకి గట్టుమల్లు

సామాజిక సమీకరణాలతోపాటు ప్రభాకర్‌రావు సూచనల ప్రకారం హైదరాబాద్‌ నగరంపై రాజకీయంగా, ఇతరత్రా పట్టు నిలుపుకొనేందుకు భారాస అధినాయకత్వం 2017లో తనను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించిందని రాధాకిషన్‌రావు విచారణలో అంగీకరించారు. ఆ తర్వాత తన సూచన మేరకు గట్టుమల్లును పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ప్రభుత్వం నియమించిందన్నారు. అక్కడ రెండేళ్లపాటు అంటే 2021 వరకూ పనిచేశాక.. తమ ఉమ్మడి లక్ష్యసాధన(భారాస పాలన కొనసాగేలా చూడటం)లో భాగంగా తన సూచన మేరకు గట్టుమల్లును ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీలోకి తీసుకున్నారని రాధాకిషన్‌రావు వెల్లడించారు. ఆ తర్వాతి నుంచి రాష్ట్రంలో భారాస(అప్పటి తెరాస)ను బలోపేతం చేయడంతోపాటు అదే పార్టీ పాలన కొనసాగేలా చూసేందుకు ప్రభాకర్‌రావు, భుజంగరావు, వేణుగోపాల్‌రావు, ప్రణీత్‌రావులు తరచూ సమావేశమవుతుండేవారు. తమ రహస్య, అనధికారిక కార్యకలాపాలు బయటకు పొక్కకుండా వాట్సప్‌, సిగ్నల్‌, స్నాప్‌చాట్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో భారాసను ఎలాగైనా మళ్లీ అధికారంలోకి తేవడంతోపాటు పార్టీపై అధినేతకు పూర్తి అజమాయీషీ ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ప్రభాకర్‌రావు బృందం భావించిందని, దీనిలో భాగంగా ప్రతిపక్షాల నాయకులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, వ్యాపారులు, భారాస అసమ్మతి వర్గీయులతోపాటు అదే పార్టీలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా పెట్టిందని రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడించారు.

రాజకీయ పలుకుబడితో రెండుసార్లు ఓఎస్డీగా..

రాధాకిషన్‌రావుకు సంబంధించిన కొన్ని కీలకాంశాలను పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. 2020 ఆగస్టులో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఆయన పదవీ విరమణ చేశారు. రాజకీయ పలుకుబడి, సామాజికవర్గ సమీకరణాలు ఉపయోగించి, అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి మూడేళ్లపాటు ఓఎస్డీగా నియమితులయ్యారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ అధినేతగా కొనసాగారు. 2023 ఆగస్టు నాటికి మూడేళ్లు పూర్తి కాగా.. మరో మూడేళ్లపాటు ఇదే హోదాలో పనిచేసేందుకు ఇంకోసారి అనుమతి తెచ్చుకున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్లో తమ పట్టు కొనసాగించాలంటే రాధాకిషన్‌రావు అవసరం ఉందని అప్పటి రాజకీయ పెద్దలతోపాటు ప్రభాకర్‌రావు కూడా భావించారు.


ఆయన ఆదేశాలతోనే ఎన్నికల డబ్బు స్వాధీనం

టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసినప్పుడు ప్రభాకర్‌రావు ఆదేశాలు, ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్‌రావు డబ్బు స్వాధీనం వంటి కేసులు పట్టుకున్నారు. వాస్తవానికి టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు.

  •  ప్రభాకర్‌రావు సూచనల మేరకు 2018 ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని రాధాకిషన్‌రావుకు ప్రణీత్‌రావు చేరవేశారు. దీని ఆధారంగా రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది హైదరాబాద్‌లోని రామ్‌గోపాల్‌పేట ఠాణా పరిధిలో ప్యారడైజ్‌ హోటల్‌ వద్ద శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం  తరఫున పోటీ చేసిన భవ్య సిమెంట్స్‌ సంస్థ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు చెందిన రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
  • 2020లో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్‌రావు బృందం సాంకేతిక నిఘా (టెక్నికల్‌ సర్వేలైన్స్‌) కార్యకలాపాలు నిర్వహించింది. ఈ బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువులకు సంబంధించి సిద్దిపేటలోని ఒక చిట్‌ఫండ్‌ కంపెనీకి చెందిన కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
  • 2022 మునుగోడు ఉప ఎన్నిక  సందర్భంగా కూడా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు సాంకేతిక నిఘా నిర్వహించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నాటి భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  అనుచరులైన గుంట సాయికుమార్‌రెడ్డి, కుండె మహేశ్‌, డి.సందీప్‌కుమార్‌, ఎం.మహేందర్‌, ఎ.అనూష్‌రెడ్డి, వెన్నం భరత్‌ల నుంచి రూ.3.5 కోట్లు స్వాధీనం చేసుకుని.. గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని