పెంచిన టెట్‌ ఫీజులను వెంటనే తగ్గించాలి

తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Published : 02 Apr 2024 03:32 IST

సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం హరీశ్‌రావు లేఖ రాశారు. ‘‘భారాస ప్రభుత్వ హయాంలో టెట్‌ ఒక పేపర్‌ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా.. ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌కు రెట్టింపు ఉన్నాయి. రిజర్వుడు విభాగం విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తోంది. టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోంది. వెంటనే టెట్‌ ఫీజులు తగ్గించాలి’’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని