బోధన ఫీజులకు 5 శాతం మంది దూరం

రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకార వేతనాలకు 5 శాతం మంది విద్యార్థులు దూరంగా ఉన్నారు.

Published : 02 Apr 2024 03:32 IST

ముగిసిన ఉపకార వేతనాల దరఖాస్తు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకార వేతనాలకు 5 శాతం మంది విద్యార్థులు దూరంగా ఉన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా గడువు పొడిగించినా దరఖాస్తు చేసుకోలేదు. ఈ విద్యాసంవత్సరానికి మార్చి 31న నాటికి గడువు ముగిసింది. దాదాపు 70వేల మంది విద్యార్థులకు అర్హత ఉన్నా దరఖాస్తు చేయలేదని వెల్లడైంది. రాష్ట్రంలో ఏటా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బోధన ఫీజులు, ఉపకార వేతనాలు అందిస్తోంది. బోధన ఫీజుల కోసం ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటుండగా, నిధుల డిమాండ్‌ రూ.2,450 కోట్లు ఉంటోంది. 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల ప్రవేశాలు జనవరితో ముగిశాయి. సెట్‌ వివరాలు ఎస్సీ సంక్షేమశాఖకు అందాయి. అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని పలుమార్లు సంక్షేమశాఖ సూచించింది.  గడువులోగా కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లో 98 శాతం మంది దరఖాస్తు చేసినట్లు సంక్షేమవర్గాలు వెల్లడించాయి. రెన్యువల్‌ విద్యార్థుల్లో 90 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేయగా, మిగతా వారు దూరంగా ఉన్నట్లు తెలిపాయి.

కళాశాలల నిర్లక్ష్యంతో ఇబ్బందులు..

ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు నిధుల మంజూరులో ఆలస్యమవుతోంది. ఇప్పటికే బకాయిలు దాదాపు రూ.5,600 కోట్లకు చేరాయి. మరోవైపు కళాశాలలు బోధన ఫీజుల దరఖాస్తు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులు ఏటా దరఖాస్తు చేసినప్పుడే మరుసటి ఏడాది రెన్యువల్‌కు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 2023-24 ఏడాదికి దరఖాస్తు చేయాలంటే.. 2022-23 ఏడాదికి సంబంధించిన దరఖాస్తుకు విద్యార్థులు ఆధార్‌ ధ్రువీకరణ చేయాలి. అనంతరం ఆ దరఖాస్తును సంబంధిత కళాశాల ధ్రువీకరించి, జిల్లా సంక్షేమ శాఖకు పంపించాలి. జిల్లా సంక్షేమాధికారులు ఆమోదించినపుడే మరుసటి ఏడాదికి రెన్యువల్‌కు అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలు బోధన ఫీజుల దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. కొన్ని కళాశాలల్లో గతేడాది దరఖాస్తులను ఆమోదించని ఉదంతాలున్నాయి. ఈ కారణాలతో 2023-24 ఏడాదికి పలువురు విద్యార్థులు దరఖాస్తు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. కళాశాలలతో ఇబ్బంది లేని విద్యార్థులు కొందరు చివరి నిమిషం వరకు వేచిఉండాలన్న ధోరణితో దరఖాస్తు చేయడం లేదని సంక్షేమ వర్గాలు చెబుతున్నాయి. ఆయా విద్యార్థులు గడువు ముగిసిన తరువాత దరఖాస్తుకు అవకాశమివ్వాలని కోరుతున్నారని పేర్కొన్నాయి. 2023-24 ఏడాదికి మరోసారి అవకాశమిచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు