పెరిగిన పత్తి విత్తన ధరలు

రాష్ట్రంలో పత్తి విత్తనాల ధరలు మళ్లీ పెరిగాయి. గత ఏడాది ప్యాకెట్‌ (475 గ్రాములు) ధర రూ.853  ఉండగా... ఈసారి అది రూ.864కి చేరింది.

Published : 02 Apr 2024 03:34 IST

ప్యాకెట్‌కి రూ.11 పెంపు
ఒక్కోదాని ధర రూ. 864
అన్నదాతలపై రూ. 1,331 కోట్ల భారం

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తి విత్తనాల ధరలు మళ్లీ పెరిగాయి. గత ఏడాది ప్యాకెట్‌ (475 గ్రాములు) ధర రూ.853  ఉండగా... ఈసారి అది రూ.864కి చేరింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పత్తి దిగుబడి తగ్గడంతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. తాజాగా వానాకాలం సీజన్‌లో విత్తనాల ధరలు మళ్లీ పెరగడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగవుతోంది. యాసంగి సీజన్‌ ముగిసిన వెంటనే పత్తి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో విత్తనాల ధర పెరుగుదల అన్నదాతకు పిడుగుపాటుగా మారింది. మార్కెట్‌లో బీటీ1, బీటీ2 విత్తనాలుండగా... ఎక్కువ మంది  రైతులు బీటీ-2నే కొనుగోలు చేస్తున్నారు. ఒక ఎకరానికి రెండేసి ప్యాకెట్లు అవసరం. నిరుడు వానాకాలం సీజన్‌లో 50 లక్షల ఎకరాల మేరకు పత్తి సాగయింది. ఈ ఏడాది 60.53 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.  దీనికోసం 121.06 లక్షల ప్యాకెట్లు కావాలి. ప్యాకెట్‌కు రూ.11 చొప్పున ధర పెరగడంతో రైతులపై రూ.1,331 కోట్ల భారం పడనుంది. కొన్ని చోట్ల పేరొందిన కంపెనీల విత్తనాలకు డిమాండ్‌ ఉండగా... వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి అధికధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు నకిలీ విత్తనాల బెడద తీవ్రంగా ఉంది. ధరల పెరుగుదలను సాకుగా చూపి తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారు. 

ఏటా పెరుగుదలే...

పత్తి విత్తనాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. కంపెనీల డిమాండ్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోంది. గత అయిదేళ్లలో ఈ ధర రూ.134 మేర అధికమైంది. 2020-21లో బీటీ2 ప్యాకెట్‌ ధర రూ.730 ఉండగా దాన్ని 2021-22కి రూ.767కి పెంచింది. 2022-23లో అది రూ.810 అయింది. 2023-24 సీజన్‌లో దానిని 853కి పెంచారు. తాజా (2024-25 సీజన్‌)గా ఈ ధర రూ.864 చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని