వడివడిగా వరి కోతలు

రాష్ట్రంలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. అకాల వర్షాల భయంతో వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్నదాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 02 Apr 2024 03:39 IST

అకాల వర్షాల భయంతోనే ముందస్తుగా..
ఆరు జిల్లాల్లో ముమ్మరం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. అకాల వర్షాల భయంతో వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్నదాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా సూర్యాపేట, నిజామాబాద్‌, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ జిల్లాల్లో కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో యాసంగి వరి సాగు 51.32 లక్షల ఎకరాల్లో చేపట్టారు. వర్షాభావంతో నీటి కొరత ఏర్పడి సాగు కష్టాల నడుమే సాగింది. గత నెలలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం సంభవించింది. ముందుగా వరి వేసిన చోట ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల మరో నెల రోజులు పట్టనుంది.

కోత యంత్రాలకు భారీగా డిమాండు

గతేడాది ఇదే సమయంలో అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. గత నెలలోనూ ఒకట్రెండ్రోజులు కురిశాయి. దీంతో రైతులు వీలైనంత త్వరగా కోతలను పూర్తి చేసేందుకు యత్నిస్తుండటంతో కోత యంత్రాలకు గిరాకీ ఏర్పడింది. గంటకు టైర్‌ హార్వెస్టర్‌కు రూ.2200, చైన్‌ హార్వెస్టర్‌కు రూ.2600 చొప్పున చెల్లిస్తున్నారు. ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఖర్చవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు వడ్లను ఆరబెట్టి తరలిస్తున్నారు. మరోవైపు సన్నరకం ధాన్యానికి డిమాండు ఉండడంతో మిల్లర్లు, వ్యాపారులు పొలాలకే వచ్చి కొనుగోళ్లు చేపడుతున్నారు. పచ్చిధాన్యాన్నే తీసుకెళ్తుండటంతో రైతులకు కొంత శ్రమ తగ్గుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని