ఏప్రిల్‌ 10 తర్వాత ఎన్‌ఎంసీ ఆన్‌లైన్‌ తనిఖీలు

2024-25 విద్యాసంవత్సరానికిగాను కొత్తగా ప్రారంభంకానున్న 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులతో పాటు, రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను ఈ ఏడాది కొనసాగించేందుకు అవసరమైన ప్రక్రియ మొదలవుతోంది

Published : 02 Apr 2024 03:42 IST

ఎంబీబీఎస్‌ సీట్ల కొనసాగింపు.. కొత్త కాలేజీల అనుమతులపై పరిశీలన
ఏర్పాట్లను సమీక్షిస్తున్న డీఎంఈ

ఈనాడు, హైదరాబాద్‌: 2024-25 విద్యాసంవత్సరానికిగాను కొత్తగా ప్రారంభంకానున్న 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులతో పాటు, రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను ఈ ఏడాది కొనసాగించేందుకు అవసరమైన ప్రక్రియ మొదలవుతోంది  ఏప్రిల్‌ 10 తర్వాత జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆన్‌లైన్‌లో తనిఖీలు చేపట్టనుంది. దీంతోపాటు పలు వివరాలనూ పరిశీలిస్తుంది.  మార్చి 31వ తేదీకే  తనిఖీలకు శ్రీకారం చుట్టాల్సి ఉన్నా గడువు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 10వ తేదీ తర్వాత జాతీయ వైద్యకమిషన్‌ తనిఖీలను ప్రారంభించనుంది. రాష్ట్రంలో 34 ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న 8 వైద్య కళాశాలల వివరాలను రాష్ట్ర వైద్య విద్య డైరెక్టరేట్‌  (డీఎంఈ) ఇప్పటికే వైద్యకమిషన్‌కు అందించింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించే ప్రక్రియకు శ్రీకారంచుట్టారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి.  చాలా కళాశాలల్లో ఇప్పటికే ప్రక్రియ పూర్తి చేసినా కొన్ని కాలేజీల్లో మాత్రం ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నియామకం ఆగింది. రెండు రోజుల క్రితం వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్‌ నియామకాలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో వారం రోజుల్లో నియామక ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిచేసేలా డీఎంఈ ఏర్పాట్లుచేస్తోంది. 10వ తేదీలోపు పూర్తి స్థాయిలో ఎన్‌ఎంసీ తనిఖీలకు సన్నద్దం కావాలని డీఎంఈ ఇప్పటికే అన్ని వైద్య కళాశాలలను ఆదేశించారు. ఈసారి గతంలో కంటే భిన్నంగా పూర్తిగా ఆన్‌లైన్‌లో వివరాలను ఎన్‌ఎంసీ పరిశీలించనుంది. వైద్య కళాశాలల్లో వసతులు, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, అనుబంధ బోధనాసుపత్రి, బోధన సిబ్బంది అటెండెన్స్‌ సహా పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లోనే పరిశీలించనున్నారు. తొలిసారిగా ఈ విధానాన్ని ఎన్‌ఎంసీ అనుసరిస్తున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా రాష్ట్ర వైద్య కళాశాలలు సిద్ధమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని