ఎండల తీవ్రతపై ముందుజాగ్రత్త చర్యలు

వేసవి నేపథ్యంలో ఏప్రిల్‌, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ, డీ-హైడ్రేషన్‌ వంటివాటి బారిన పడకుండా చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎ.శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Published : 02 Apr 2024 03:52 IST

తాగునీటి ఎద్దడి నివారించాలి
వడదెబ్బపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్లతో సమీక్షలోసీఎస్‌ శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి నేపథ్యంలో ఏప్రిల్‌, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ, డీ-హైడ్రేషన్‌ వంటివాటి బారిన పడకుండా చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎ.శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలు.. తాగునీటి సరఫరా.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు.. ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సోమవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశముంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లు, ఇతర మందులను పెద్దమొత్తంలో పంపిణీ చేశాం. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఆశా కార్యకర్తల వద్ద, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద కూడా అందుబాటులో ఉంచాలి. పిల్లలు, వృద్ధులు ఎండల వేళ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. మంచినీటి సరఫరాను సమర్థంగా అమలు చేసేందుకు, రోజూ పర్యవేక్షించడానికి.. ప్రతి మండలానికి జిల్లాస్థాయి అధికారిని, ప్రతి వార్డు, గ్రామానికి మండలస్థాయి అధికారిని నియమిస్తున్నాం. స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో మంచినీటి సరఫరాను పర్యవేక్షిస్తారు. ఏ గ్రామంలోనైనా మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే, వ్యవసాయ బావుల నుంచి అద్దె ప్రాతిపదికన నీటిని సరఫరా చేయాలి. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా కూడా అందించాలి. ఇప్పటికే అన్ని గ్రామాల్లోని బోరుబావుల మరమ్మతులు పూర్తిచేశాం. పైపులైన్ల లీకేజీలను అరికట్టాం. నాగార్జునసాగర్‌ నుంచి పాలేరు జలాశయానికి తాగునీటి అవసరాలకు సోమవారం ఉదయం కృష్ణా జలాలను విడుదల చేశారు. ఇవి పాలేరు ప్రాజెక్టుకు చేరుకునేలా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో మన ఊరు-మన బడి కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటినీ వెంటనే ప్రారంభించి, పురోగతిని పర్యవేక్షించాలి’’ అని కలెక్టర్లను ఆదేశించారు.

పటిష్ఠంగా ‘నియమావళి’ అమలు

రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్ఠంగా అమలు చేయాలని సీఎస్‌ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నియమావళి అమలుపై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితి, చెక్‌పోస్టుల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట, శంషాబాద్‌ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలను గుర్తించాలని, నిఘా పెంచాలని అటవీ శాఖ అధికారులకు నిర్దేశించారు. నియమావళి అమల్లోకి వచ్చిన ఈ పక్షం రోజుల్లో.. సుమారు రూ.35 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ రవిగుప్తా వివరించారు. సమీకృత సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా వాణిజ్య పన్నుల శాఖ నిఘాను పెంచిన ఫలితంగా రూ.5.19 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని