అరుదైన ‘కేన్‌’ మొక్కలకు ఆపద!

మానవ తప్పిదాలతో ఓ అరుదైన వెదురు జాతి రాష్ట్రంలో అంతరించిపోయే దశకు చేరుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట శివారులో రామప్ప ఆలయం తూర్పు ద్వారం సమీపంలో కి.మీ. పరిధిలో అరుదైన ఈ కేన్‌ మొక్కలు ఏపుగా పెరుగుతుంటాయి.

Updated : 02 Apr 2024 05:18 IST

రాష్ట్రంలో ఈ వెదురు పెరిగేది పాలంపేటలోనే
గతంలో 43 ఎకరాల్లో ఈ మొక్కలు
ఆక్రమణలతో ప్రస్తుతం 5 ఎకరాలకే పరిమితం

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి- వెంకటాపూర్‌ (ములుగు), న్యూస్‌టుడే: మానవ తప్పిదాలతో ఓ అరుదైన వెదురు జాతి రాష్ట్రంలో అంతరించిపోయే దశకు చేరుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట శివారులో రామప్ప ఆలయం తూర్పు ద్వారం సమీపంలో కి.మీ. పరిధిలో అరుదైన ఈ కేన్‌ మొక్కలు ఏపుగా పెరుగుతుంటాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతోంది. స్థానికంగా ‘సాప తీగ బరిగె’ అని పిలుచుకునే ఈ కేన్‌ మొక్కలు ఒక్క పాలంపేటలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు. దీంతో 1974లో ఈ ప్రాంతాన్ని అటవీశాఖ జీవవైవిధ్య, పరిరక్షణ ప్రాంతంగా గుర్తించింది. ఈ మొక్కలపై పరిశోధనకు వృక్షశాస్త్ర నిపుణులు, విద్యార్థులు వచ్చేవారు. తర్వాత ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది.

ఈ మొక్కలను సంరక్షించాలన్న స్థానికుల డిమాండ్‌తో 2014లో అటవీ, రెవెన్యూ శాఖలు సర్వే చేపట్టి ఈ ప్రాంతంలో 43 ఎకరాల్లో కేన్‌ మొక్కలు ఉన్నట్లు గుర్తించి, చుట్టూ కందకం తవ్వించారు. కొద్దిరోజులు దృష్టిసారించినా.. మళ్లీ ఆ స్థలాలు సాగు కోసం ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం ఐదెకరాల్లోనే విస్తరించి ఉన్నాయి. వాటినీ కొద్దికొద్దిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఇటీవల వీటి వద్ద నిప్పు పెట్టడంతో పెద్దసంఖ్యలో మొక్కలు కాలిపోయాయి. గతంలో ఇక్కడ కొన్ని కుటుంబాలు ఈ వెదురుతో చేతికర్రలు, ఊయల కుర్చీలు తయారు చేసి ఉపాధి పొందేవి. కొన్నేళ్లుగా వారు వలస వెళ్లడంతో వీటిని పట్టించుకునే వారు కరవయ్యారు.

 

రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

ఆక్రమణలకు అడ్డుకట్టవేసి కేన్‌ మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏళ్లుగా అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్థానికంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వృక్షశాస్త్రవేత్త, కేన్‌ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ డాక్టర్‌ సుతారి సతీశ్‌ తెలిపారు. కేన్‌ మొక్కలున్న ప్రాంతాన్ని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించేందుకు కృషి చేస్తునట్లు ములుగు డీఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని