సంక్షిప్త వార్తలు (4)

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తాగునీటి విడుదలపై చర్చించేందుకు ఈ నెల 4న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది.

Updated : 03 Apr 2024 06:28 IST

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం రేపు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తాగునీటి విడుదలపై చర్చించేందుకు ఈ నెల 4న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, బోర్డు సభ్యుడితో కూడిన కమిటీ సమావేశం కానుంది. అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ఇప్పటి వరకు వినియోగం, పొదుపు చర్యలపై చర్చిస్తారు. తాగునీటి అవసరాలకు తమకు 5 టీఎంసీలు విడుదల చేయాలని ఇప్పటికే బోర్డుకు ఏపీ లేఖ రాసింది.


ఏడాదిలో 416 కి.మీ. రైల్వే ట్రాక్‌ నిర్మాణం: ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రికార్డు స్థాయిలో అదనంగా 416 కి.మీ. ట్రాక్‌ తన నెట్‌వర్క్‌లో చేరిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో 39 కి.మీ. ట్రాక్‌ కొత్త లైన్లు కాగా, 54 కి.మీ. గేజ్‌ మార్పిడి, 133 కి.మీ. రెండో లైను, 190 కి.మీ. మేర మూడో లైన్లను నిర్మించినట్లు వివరించింది. జోన్‌ ఏర్పాటైనప్పటి నుంచి ఇదే అత్యధికమని వివరించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త రైల్వే లైన్లలో.. మనోహరాబాద్‌-కొత్తపల్లి ప్రాజెక్టులో 11 కి.మీ., ఏపీలోని నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టులో గుండ్లకమ్మ-దర్శి మధ్య 28 కి.మీ. మేర నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొంది.


కేసు ఎత్తివేయాలని యూఎస్‌పీసీ, జాక్టో నేతల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పీఆర్‌సీ, పదోన్నతులు కోరుతూ 2020 డిసెంబరు 29న ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించినపుడు తమపై పెట్టిన క్రిమినల్‌ కేసును ఎత్తివేయాలని యూఎస్‌పీసీ, జాక్టో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి, టి.లింగారెడ్డి, జి.సదానందంగౌడ్‌ మంగళవారం డిమాండ్‌ చేశారు. పోలీసులు తమపై అక్రమంగా కేసు పెట్టారని.. ప్రతి నెలా రెండు రోజులు కోర్టు వాయిదాలకు తిరగడం ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా ఇంకా చర్య తీసుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం కేసును ఎత్తివేయాలని వారు కోరారు.


పోలింగ్‌ సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి
టీఎస్‌యూటీఎఫ్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవిలు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. పోలింగు కేంద్రాల్లో అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని, విధుల్లో ఉన్న వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందరికీ సమానంగా భత్యాలు ఇవ్వాలని, రవాణా సౌకర్యం కల్పించాలని, గర్భిణులు, వ్యాధిగ్రస్తులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని, అర్హులైన వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్లు ఇవ్వాలని అభ్యర్థించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని