గత ఆరు నెలల్లో 57.6% లోటు వర్షపాతం

రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

Published : 03 Apr 2024 05:39 IST

డెడ్‌స్టోరేజీకి చేరిన ప్రధాన జలాశయాలు
గత మార్చితో పోలిస్తే 2.5 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జల మట్టం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు తాగు అవసరాలకు మినహా సాగుకు ఎంతమాత్రం నీటిని ఇవ్వలేని పరిస్థితి (డెడ్‌ స్టోరేజి)కి చేరాయి. భూగర్భ జలమట్టాలు సైతం గత పదేళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో పడిపోయాయి. దీంతో సాగునీటి కోసం రైతులు కొత్త బోర్లు వేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

ప్రభావం చూపిన ‘డ్రైస్పెల్‌’

2023 అక్టోబరు నుంచి గడిచిన మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 139.9 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.2 మి.మీటర్ల వర్షపాతమే పడింది. దీంతో ఈ ఆరు నెలల కాలంలో 57.6 శాతం లోటు ఏర్పడింది. ఇది వివిధ రకాల వనరులపై ప్రభావాన్ని చూపుతోంది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈ మార్చిలో భూగర్భ జల మట్టం 2.5 మీటర్లకు పడిపోయింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే వర్షాలు కురిసినట్లుగానే కనిపిస్తున్నా.. 2023 జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యాయి. అప్పట్లో ఎల్‌నినో ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ఒక్క జులైలోనే కొన్ని జిల్లాల్లో రాత్రికి రాత్రే భారీ వరదలు వచ్చాయి. అనంతరం అక్టోబరు నుంచి మార్చి వరకు వర్షాల జాడలేకుండా పోయింది. వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్‌) భారీగా నమోదైంది. ఈ ప్రభావం జలాశయాలపై పడింది. కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో ప్రధాన జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.

నాగార్జునసాగర్‌ కింద ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది 35 టీఎంసీలు మాత్రమే కాగా.. వానాకాలంలో పంట కాలువలకు 27 టీఎంసీలు విడుదల చేశారు.

యాసంగిలో సాగర్‌ ఆయకట్టు కింద 6 లక్షల ఎకరాల్లో పంట సాగుకు 50 టీఎంసీలు అవసరం కాగా జలాశయంలో మిగిలిన 8 టీఎంసీలు ఎటూ చాలని పరిస్థితి ఏర్పడింది. సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 513.40 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. శ్రీశైలం జలాయశం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 810.10 అడుగుల వద్ద ఉంది. కృష్ణా పరీవాహకంలో ఈ ఏడాది (2023 జూన్‌ నుంచి) ఇప్పటివరకు జూరాల జలాశయానికి ఎగువ నుంచి 154.05 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. 2021లో 1306.25 టీఎంసీలు, 2022లో 885.85 టీఎంసీలు, 2023లో 1229.98 టీఎంసీలు వచ్చాయి.

  • గోదావరి పరీవాహకంలో ఈ ఏడాది శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చిన సగటు ఇన్‌ఫ్లో 205.75 టీఎంసీలు. 2021లో 367.05 టీఎంసీలు, 2022లో 677.94 టీఎంసీలు, 2023లో 590.16 టీఎంసీలు ఎగువ నుంచి వచ్చాయి.
  • హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, సింగూరు, మంజీరా, అక్కంపల్లి జలాశయాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 39.78 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం వీటిలో 25.38 టీఎంసీలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 29.71 టీఎంసీలు ఉన్నాయి.
  • 2021 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 1 వరకు ప్రధాన జలాశయాల మట్టాలను పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని