కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కన్నారావు అరెస్టు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్‌ కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు.

Published : 03 Apr 2024 05:39 IST

భూ ఆక్రమణపై గత నెలలో కేసు నమోదు
14 రోజుల రిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌- ఆదిభట్ల, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్‌ కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు మన్నెగూడలో భూ ఆక్రమణ, హత్యాయత్నం కేసులో మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మార్చి 3న ఈ కేసు నమోదు కాగా అప్పటి నుంచి కన్నారావు పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో బాలాపూర్‌లో ఆయన ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకున్నామని, అనంతరం ఇబ్రహీంపట్నం న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించామని ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మన్నెగూడలోని సర్వే నంబరు 32/ఆర్‌యూయూలో జక్కిడి సురేందర్‌రెడ్డికి 2.10 ఎకరాల భూమి ఉంది. ఆయన 2013లో చామ సురేశ్‌ అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు తీసుకుని అతని పేరిట జీపీఏ(జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ) చేసి, డబ్బు తిరిగిచ్చినప్పుడు భూమి తనకు అప్పగించాలని ఒప్పందపత్రం రాసుకున్నారు. 2020 వరకూ డబ్బు చెల్లించకపోవడంతో సురేశ్‌ సదరు భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఓఎస్‌ఆర్‌ అనే సంస్థకు విక్రయించారు. దీంతో కక్ష పెంచుకున్న సురేందర్‌రెడ్డి తన ప్రమేయం లేకుండా భూమి ఎలా కొనుగోలు చేస్తారంటూ సంస్థ నిర్వాహకులతో తరచూ ఘర్షణకు దిగేవారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన సోదరులు, ఇతర అనుచరులతో కలిసి భూమిలోకి బలవంతంగా ప్రవేశించి బెదిరింపులకు దిగారు. దీనిపై ఓఎస్‌ఆర్‌ సంస్థ ఫిర్యాదుతో ఆదిభట్ల ఠాణాలో కేసు నమోదైంది. తరువాత కూడా తీరు మార్చుకోని సురేందర్‌రెడ్డి, ఆయన సోదరులు భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేశారు.

రూ.3 కోట్ల డీల్‌!

తెలిసిన వ్యక్తుల ద్వారా కల్వకుంట్ల కన్నారావును సంప్రదించారు. భూమి తమకు దక్కేలా చేస్తే రూ.3 కోట్లు ఇస్తామని డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా మార్చి 3వ తేదీ తెల్లవారుజామున కన్నారావు, సురేందర్‌రెడ్డి, హరినాథ్‌, సురేశ్‌, డేనియల్‌ సహా దాదాపు 20 మంది ఆయుధాలతో ఓఎస్‌ఆర్‌ సంస్థ భూమిలోకి ప్రవేశించారు. ప్రహరీని కూల్చేసి అక్కడ పనిచేసే సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కంటెయినర్‌, గుడిసెను దహనం చేసి భయానక పరిస్థితులు సృష్టించారు. సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జేసీబీ డ్రైవరు సహా మరో ముగ్గుర్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటనలో మొత్తం 38 మందిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కన్నారావు సహా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు ఇతర రాష్ట్రాల్లోనూ గాలించారు. కన్నారావు రెండుసార్లు ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.

సుప్రీంకోర్టుకు వెళతాం: కన్నారావు

రిమాండుకు తరలించే సమయంలో ఆదిభట్ల ఠాణాలో కన్నారావు విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో తానే ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌ చేసి లొంగిపోయానని, ఈ కేసుపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని