ఎన్నికల ప్రసంగాలు ఇవ్వడానికి.. కోర్టులు రాజకీయ వేదికలు కావు

విచారణ సందర్భంగా ఎన్నికల ప్రసంగాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కావని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని, ముడుపులు చేతులు మారాయని మీకెలా తెలిసిందని పిటిషనర్లను ప్రశ్నించింది.

Published : 03 Apr 2024 05:40 IST

కాళేశ్వరం నిర్మాణంలో ముడుపులు చేతులు మారాయని ఎలా తెలుసు
ఇందులో మీ పరిశోధన ఏమిటి?
పిటిషనర్లు, న్యాయవాదులపై హైకోర్టు ప్రశ్నల వర్షం
ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలా? ప్రచార వ్యాజ్యాలా అంటూ నిలదీత
సీబీఐ దర్యాప్తుపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: విచారణ సందర్భంగా ఎన్నికల ప్రసంగాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కావని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని, ముడుపులు చేతులు మారాయని మీకెలా తెలిసిందని పిటిషనర్లను ప్రశ్నించింది. 2016లో ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? అవినీతి జరిగిందని గతంలో ఎవరికైనా ఫిర్యాదు చేశారా? అంటూ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించామని ప్రభుత్వం పేర్కొంటున్నా.. దీనికి సంబంధించి తాము గతంలో ఉత్తర్వులు ఇచ్చామని చెబుతున్నా పట్టించుకోరా? అని నిలదీసింది. మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దాఖలైనవి ప్రజాప్రయోజన వ్యాజ్యాలో, ప్రచార వ్యాజ్యాలో చెప్పాలంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌, బి.రామ్మోహన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి, ముధుగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కె.ఎ.పాల్‌ వాదనలు వినిపిస్తూ రెండేళ్లపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలు సేకరించానని పేర్కొన్నారు.

ఈ దశలోనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశిస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని, సదరు ఉత్తర్వులతో ఏకీభవిస్తారా లేకుంటే ప్రచార కాంక్షతో వాదనలు కొనసాగిస్తారా అని ప్రశ్నించింది. పాల్‌ వాదనలు కొనసాగిస్తుండటంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘ఈ రోజే దీన్ని తేల్చేయాలా, మీ పిటిషన్‌లను అనుమతించి తప్పు చేసినవారిని జైలుకు పంపాలా, ఇది మీ ఎన్నికల ఎజెండానా’ అంటూ మండిపడింది. కోర్టు విచారణకు ఓ విధానం ఉంటుందని, ప్రభుత్వ వాదన వినాల్సి ఉందని, ఈ అంశం మీకు అర్థం కాకపోతే అమికస్‌ క్యూరీగా మరొకరిని నియమిస్తామంది. ‘‘అవినీతి జరిగిందని ఎలా తెలిసింది. ఆ విషయాన్ని పిటిషన్‌లో ఎక్కడ పేర్కొన్నారు. మీడియా కథనాలు అని చెబుతున్నారు. అవి కాకుండా మీరు చేసిన పరిశోధనలేంటి. ముడుపులు చేతులు మారాయనడానికి ఆధారాలేమిటి. ప్రాజెక్టు నాలుగు పియర్స్‌కు మరమ్మతు చేయించాలంటున్నారు. ఇప్పుడు మేము వెళ్లి పనులు చేయించాలా. అందరం వెళ్లి ప్రాజెక్టుకు అడ్డుగా నిలబడదామా’’ అంటూ వ్యాఖ్యానించింది. సీజనల్‌గా పిటిషన్‌లు వేసే మీరు ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా వేయాలో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. హైకోర్టు నిబంధనల ప్రకారం పిటిషన్‌ను సవరించి దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

పిల్‌ వేయడం వరకే మీ పని

ఇతరుల వాటితో తమ పిటిషన్‌ను జతచేయవద్దని బక్క జడ్సన్‌ తరఫు న్యాయవాది ఎస్‌.శరత్‌ కోరారు. పాల్‌ వేసిన పిటిషన్‌తో మిగిలిన వాటిని కలపడం సరికాదని, దాన్ని విడిగా విచారించాలని విన్నవించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘‘ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి తరఫు న్యాయవాది గడువు కోరుతున్నారు. మీరేమో ఇప్పుడే విచారించాలంటున్నారు. ఇలా విడివిడిగా విచారించలేం. ఒకవేళ అదే మీ అభ్యర్థన అయితే తిరస్కరిస్తూ రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేస్తున్నామని’’ తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సమస్యను కోర్టు దృష్టికి తీసుకురావడం వరకే మీ బాధ్యత అని, మిగిలిన అంశాలు కోర్టు చూసుకుంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని, అదే చట్టమని తేల్చి చెప్పింది. ‘‘పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు స్వీకరించింది. ఇకపై మీకు పిటిషన్‌లతో సంబంధం లేదు. ఇందులో మీరు హాజరుకావాల్సిన అవసరం లేదు. అది మా పిటిషన్‌ అనడానికి ఇదేం సర్వీసు వివాదమూ కాదు’’ అని న్యాయవాదులను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.

విశ్వనాథరెడ్డి తరఫు న్యాయవాది జి.నందిత వాదనలు వినిపిస్తూ.. తాము ఎన్నికలకు ముందే గత నవంబరులో పిటిషన్‌ దాఖలు చేశామని, నంబరు కేటాయించడంలో జాప్యం జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం అసహనం వ్యక్తంచేస్తూ రాజకీయ ప్రయోజనాలతో పిటిషన్‌ దాఖలు చేశారా? అంటూ ప్రశ్నించింది. పిటిషన్‌ మొదటిసారి విచారణకు వచ్చినపుడు న్యాయవాదిగా మీరెందుకు హాజరుకాలేదని నిలదీసింది. ప్రభుత్వ వాదన వినకుండా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్‌లపై విడివిడిగా విచారించలేమని స్పష్టంచేసింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ‘‘పిటిషనర్ల ఆత్రుత ఎలా ఉందో గమనిస్తున్నారా’’ అంటూ ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వ వివరణ తెలుసుకుని చెప్పాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని