తెలంగాణలో 78,327 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం

దేశంలో ఇంధన ఉత్పత్తి, వినియోగం భారీగా పెరుగుతున్నట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని రకాల ఇంధన వనరులపై జాతీయ నివేదికను ఈ శాఖ తాజాగా విడుదల చేసింది.

Published : 03 Apr 2024 02:58 IST

సంప్రదాయేతర ఇంధన వనరులపై కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఇంధన ఉత్పత్తి, వినియోగం భారీగా పెరుగుతున్నట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని రకాల ఇంధన వనరులపై జాతీయ నివేదికను ఈ శాఖ తాజాగా విడుదల చేసింది. దేశంలో పవన, జల, సౌరవిద్యుత్‌ వంటి సంప్రదాయేతర/పునర్వినియోగ ఇంధన (ఆర్‌ఈ) వనరుల ద్వారా దేశంలో 21.09 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని వివరించింది. తెలంగాణలో 78,327 మెగావాట్ల ఉత్పత్తికి సరిపడే ఆర్‌ఈ వనరులున్నాయి. ఇందులో ప్రధానంగా పవన విద్యుత్‌ 54,717, సౌరవిద్యుత్‌ 20,410, వ్యర్థాల నుంచి 1678, జలవిద్యుత్‌ రూపంలో 1404 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశాలున్నాయి. కానీ ప్రస్తుతం అన్ని రకాల ఆర్‌ఈ వనరులతో సుమారు అయిదు వేల మె.వా. మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణలో మొత్తం 23,034 మిలియన్‌ టన్నులు, దేశంలో మొత్తం 3,61,411 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి.

  • 2023 నాటికి ..రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా రాజస్థాన్‌లో 22,398 మె.వా., గుజరాత్‌లో 19,436 మె.వా. మేర పవన, సౌరవిద్యుదుత్పత్తి జరుగుతోంది.
  • దేశంలో వార్షిక తలసరి కరెంటు వినియోగం 2013-14లో 698 యూనిట్లుండగా.. 2022-23లో 1015 యూనిట్లకు చేరింది.
  • అన్ని రకాల ఇంధన వినియోగం వల్ల గాలిలోకి విడుదలైన కార్బన్‌ డైయాక్సైడ్‌(సీఓ2) 2011లో 16.51 లక్షల గిగా గ్రాములు కాగా.. అది 2016లో 21.29 లక్షలకు పెరిగింది. ఇంధన వనరుల వినియోగం వల్ల కాలుష్యం పెరుగుదలను ఇది సూచిస్తోంది.
  • దేశంలో 77.18 శాతం విద్యుత్తు థర్మల్‌ కేంద్రాల నుంచి, 20.34 శాతం ఆర్‌ఈ నుంచి వస్తోంది. మిగిలినది అణు, ఇతర వనరులతో ఉత్పత్తి అవుతోంది.
  • భూగర్భం నుంచి తవ్వి తీసిన బొగ్గు వినియోగం 2011-12లో 638.73 మిలియన్‌ టన్నులు (మి.ట.) ఉండగా.. 2022-23 నాటికి 1115.22 మి.ట.లకు పెరిగింది. మొత్తం బొగ్గు వినియోగంలో 70.40 శాతం థర్మల్‌ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తికే వెళ్లింది.
  • దేశంలో 2022-23లో వినియోగమైన మొత్తం 14.03 లక్షల గిగావాట్‌ యూనిట్ల కరెంటులో... ఇళ్లలో 26 శాతం, వ్యవసాయానికి 17, పరిశ్రమలకు 42, వాణిజ్య సంస్థలకు 8, రైల్వేలకు 2, ఇతర అవసరాలకు 5 శాతం వాడినట్లు తేలింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని