అరకొరగానే చిరుధాన్యాల సాగు

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో తెలంగాణలో సాగు అంతంత మాత్రంగానే ఉంది. జొన్న మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు.

Published : 03 Apr 2024 03:00 IST

ఈనాడు,హైదరాబాద్‌: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో తెలంగాణలో సాగు అంతంత మాత్రంగానే ఉంది. జొన్న మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు లాభదాయకంగా ఉన్నా సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లలోనూ మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు వీటివైపు మొగ్గు చూపడంలేదు. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా... అందులో చిరుధాన్యాలు 3 లక్షల ఎకరాలు దాటలేదు. రాష్ట్రంలో సాగవుతున్న చిరుధాన్యాల్లో జొన్న సాగు అధికంగా ఉంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 2,31,427 ఎకరాల్లో ఆ పంట వేశారు. సజ్జలు 10,894, రాగులు 469, కొర్రలు, సామలు ఇతర రకాలు 457 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తంగా 2,43,247 ఎకరాల్లో చిరు ధాన్యాలు ఉన్నాయి. వానాకాలంలో జొన్నలు 31,107 ఎకరాలు, సజ్జలు 400, రాగులు 388, కొర్రలు,సామలు 203 ఎకరాలకే పరిమితమైంది. చిరుధాన్యాల సాగు పెద్దఎత్తున చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నా రైతుల నుంచి ఆశించిన స్పందన లేదు. సజ్జలు, రాగులు, ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు.  మార్కెట్‌ యార్డులకు తీసుకొని వెళ్లినా కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో విక్రయాలు రైతులకు సమస్యగా మారాయి. కేంద్ర ప్రభుత్వం హైబ్రిడ్‌ జొన్నలు క్వింటాలుకు రూ.2,970, మాల్దండి జొన్నలకు రూ.2,990,  సజ్జలకు రూ.2,350, రాగులకు రూ.3,578 ధర ప్రకటించింది. ఇందులో సగం ధర కూడా తెలంగాణలోని రైతులకు రావడం లేదు. వరి, పత్తి తదితర పంటల మాదిరిగా ప్రతి సీజన్‌లో దీనిని సాగుచేయకుండా అప్పుడప్పుడు మాత్రమే పంటలుసాగు చేస్తున్నారు.  పంజాబ్‌, ఇతర రాష్ట్రాల్లో చిరుధాన్యాలకు ప్రత్యేక మార్కెట్లు ఉండగా... తెలంగాణలో అవి లేకపోవడం లోటుగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని