శ్రీధర్‌ను అరెస్టు చేయొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

మోసం, ఫోర్జరీ ఆరోపణలతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడైన లింగారెడ్డి శ్రీధర్‌ను అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 03 Apr 2024 03:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: మోసం, ఫోర్జరీ ఆరోపణలతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడైన లింగారెడ్డి శ్రీధర్‌ను అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఈ కేసులో నిందితుడైన శ్రీధర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ స్థలాన్ని పిటిషనర్‌ తండ్రి 1990లో కొనుగోలు చేశారని తెలిపారు. నవయుగ కంపెనీ ఈ స్థలాన్ని 2010లో కొనుగోలు చేసినట్లు అంగీకరిస్తోందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడైన జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఎవరో కూడా పిటిషనర్‌కు తెలియదన్నారు. ఇద్దరూ కలిసి మోసపూరితంగా కంపెనీకి చెందిన స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ అవాస్తవమన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ శ్రీధర్‌ను అరెస్టు చేయరాదని, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 11వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని