త్వరలోనే కాళేశ్వరంపై న్యాయ విచారణ

మరో వారం రోజుల్లో కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మేడిగడ్డతోపాటు ఇతర బ్యారేజీల నిర్మాణ పనుల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Updated : 03 Apr 2024 03:34 IST

ప్రభుత్వ గెజిట్‌ ప్రతులను స్వీకరించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌
ఐదు రోజుల్లో హైదరాబాద్‌కు వస్తానని హామీ
కమిషన్‌ సిబ్బంది నియామకంపై అధికారులతో చర్చ
బీఆర్కే భవన్‌ ఎనిమిదో అంతస్తులో కార్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: మరో వారం రోజుల్లో కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మేడిగడ్డతోపాటు ఇతర బ్యారేజీల నిర్మాణ పనుల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరానికి సంబంధించి మొత్తం తొమ్మిది అంశాలపై విచారణ చేయాలని ప్రభుత్వం కమిషన్‌ను కోరింది. ఈ మేరకు విధివిధానాలను రూపొందించింది. జూన్‌ నాటికి విచారణ పూర్తిచేయాలని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా నేతృత్వంలో ఓ అండ్‌ ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌ తదితర ఉన్నతాధికారులు కోల్‌కతాలో మంగళవారం జస్టిస్‌ ఘోష్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం జారీచేసిన కమిషన్‌ ఏర్పాటు గెజిట్‌, విధివిధానాల పత్రాలను అందజేశారు. ఐదు రోజుల్లో హైదరాబాద్‌కు వస్తానని జస్టిస్‌ ఘోష్‌ పేర్కొన్నట్లు సమాచారం.

బ్యారేజీలపై చర్చ

ఈ భేటీ సందర్భంగా జస్టిస్‌ ఘోష్‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించినట్లు, పలు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు విచారణ సందర్భంగా కమిషన్‌కు అవసరమయ్యే సాంకేతిక, ఇంజినీరింగ్‌ సిబ్బంది, సీడబ్ల్యూసీతోపాటు ఐఐటీ నిపుణుల సహకారం తీసుకోవడానికి సంబంధించి అంశాలు చర్చకువచ్చినట్టు సమాచారం. మరోవైపు కమిషన్‌ కార్యాలయాన్ని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని ఎనిమిదో అంతస్తులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు..సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని