టెలీ సేవల వినియోగంలో తెలంగాణది రెండో స్థానం

దేశంలో టెలికం సేవల వినియోగంలో 120 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. 108.19 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు.

Published : 03 Apr 2024 03:05 IST

సమస్యల పరిష్కారానికి నోడల్‌ అధికారి: సీఎస్‌ శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో టెలికం సేవల వినియోగంలో 120 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. 108.19 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. టెలికం సేవలపై సచివాలయంలో నిర్వహించిన 6వ బ్రాడ్‌బ్యాండ్‌ కమిటీ సమీక్షలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త టెలికం మౌలిక సదుపాయాల విస్తరణ, కల్పనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ‘‘టవర్‌ సాంద్రత, 97.4 శాతం గ్రామాల్లో మొబైల్‌ కనెక్టివిటీ తదితర టెలికం సూచికల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. రాష్ట్రంలో 3.5 కోట్ల జనాభా ఉండగా.. మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 4.14 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1448 టవర్లను జోడించడంతో టెలికం టవర్ల వృద్ధిలో వేగం పుంజుకుంది. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు, శాఖ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమర్థమైన సమన్వయం కోసం పురపాలక, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, అటవీ శాఖల్లో నోడల్‌ అధికారులను నియమించాలి’’ అని అన్నారు. సమీక్షలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని