వరికి బోనస్‌.. నష్టాలకు పరిహారమివ్వాలి

వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్‌, ఎండిన పంటకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని భారాస నేతలు డిమాండ్‌ చేశారు.

Published : 03 Apr 2024 03:07 IST

సీఎస్‌కు భారాస నేతల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్‌, ఎండిన పంటకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని భారాస నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి సచివాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఎస్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జి.జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కె.పి.వివేకానంద్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, దండే విఠల్‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, భారాస ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పంటలకు నీరివ్వడంలో సర్కారు విఫలమైంది. కరెంట్‌ సరిగ్గా ఇవ్వకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయి. కేసీఆర్‌ను నమ్ముకొని పంటలు వేశాము.. నీళ్లు ఉండి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వడం లేదని రైతులు బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో రైతులు ఉన్నారనే సోయి కూడా లేదు. ఆయన మూటలతో దిల్లీకి పోవడమే సరిపోతోంది. కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ఎన్నడూ బాధ్యతలు తెలియవు. రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే అమలుచేయాలి. ఎన్నికల కోడ్‌ ఉందని ఆగొద్దు’’ అని భారాస నేతలు పేర్కొన్నారు. రైతుల పక్షాన భారాస పోరాడుతుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని