సంక్షిప్త వార్తలు (10)

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్‌ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. గతంలో దుండగుల కాల్పుల్లో జవాన్‌ యాదయ్య మరణించారు.

Updated : 04 Apr 2024 04:08 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్‌ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. గతంలో దుండగుల కాల్పుల్లో జవాన్‌ యాదయ్య మరణించారు. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పట్టాదారు పాసుపుస్తకం అందించారు.


గల్ఫ్‌ మృతుల బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందించేలా ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ గల్ఫ్‌ సంఘాల పక్షాన పీసీసీ ప్రవాస భారతీయ విభాగం ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ తదితరులు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు


సీఎం రేవంత్‌రెడ్డిని పద్మశ్రీ పురస్కార గ్రహీత కిన్నెర మొగులయ్య బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు


నరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడిగా విజయసాయి

ఈనాడు, హైదరాబాద్‌: నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో) తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మేక విజయసాయి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీధర్‌రెడ్డి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా కాలి ప్రసాద్‌, డాక్టర్‌ లయన్‌ వై.కిరణ్‌, కోశాధికారిగా ఆర్‌.వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు వీరు పదవిలో ఉండనున్నారు. ఇటీవల జరిగిన 28వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ప్రజాసంబంధాల విభాగంతో అత్యుత్తమ సేవలు

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ అజయ్‌ మిశ్ర

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాసంబంధాల విభాగంతో ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ ఛైర్మన్‌ అజయ్‌ మిశ్ర సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో జాతీయ ప్రజాసంబంధాల మండలి (పబ్లిక్‌ రిలేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంకితభావం, నిబద్ధత ఉండాలని, ప్రభుత్వం, శాఖల మధ్యేగాక..సమాజంలోని భిన్నవిభాగాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ విభాగం అవసరమని తెలిపారు. పీఆర్సీఐ వ్యవస్థాపకులు ఎంబీ జయరామ్‌ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీఆర్సీఐ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు షకీల్‌ అహ్మద్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.


ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో నారాయణ విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని నేషనల్‌ స్పేస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నీల్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌ 2024లో తమ విద్యార్థులు సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు డా.పి.సింధూర నారాయణ, శరణి నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది విద్యాసంస్థల నుంచి పాల్గొనే సైన్స్‌ ప్రాజెక్టుల్లో మొదటి స్థానంలో 2, రెండో స్థానంలో 5, మూడో స్థానంలో 7 ప్రాజెక్టులు తమ విద్యార్థులవేనని పేర్కొన్నారు. 20 ప్రోత్సాహక ప్రాజెక్టులతో కలిపి మొత్తం 34 ప్రాజెక్టుల్లో విజయకేతనం ఎగువేసినట్లు వివరించారు.


ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటెస్ట్‌లో శ్రీచైతన్య విద్యార్థుల హవా

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటెస్ట్‌ 2024లో మొత్తం మూడు క్యాష్‌ అవార్డుల్లో 2 శ్రీచైతన్య విద్యార్థులు వరుసగా రెండో సంవత్సరం కూడా పొందినట్లు విద్యాసంస్థల డైరెక్టర్‌ సీమ బుధవారం తెలిపారు. సుమారు 28కుపైగా దేశాల నుంచి విద్యార్థులు పాల్గొన్న పోటీలో ప్రపంచ మొదటి ప్రైజ్‌-7 ప్రాజెక్టులు, రెండో ప్రైజ్‌- 11, మూడో ప్రైజ్‌- 15, ప్రోత్సాహక- 29 కలిపి మొత్తం 62 ప్రాజెక్టులు విజయం సాధించారన్నారు.


బోధన రుసుము చెల్లించాలి

ఈనాడు, హైదరాబాద్‌: సకాలంలో విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలని ఆయా కళాశాలల సంఘం సీఎం రేవంత్‌రెడ్డిని కోరింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. సూర్యనారాయణరెడ్డి, ఇతర నేతలు బుధవారం సీఎంను తన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.


వ్యవసాయమే అతి పెద్ద ఉపాధి రంగం

నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌చంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయమే దేశంలో అతి పెద్ద ఉపాధి రంగంగా వెలుగొందుతోందని, యువత సైతం వ్యవసాయం, అనుబంధ రంగాల వైపు వెళ్తున్నారని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌చంద్‌ అన్నారు. హైదరాబాద్‌ ఫార్మ్‌, సైన్స్‌ ఫౌండేషన్‌ బుధవారం హైదరాబాద్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జె.రఘోత్తంరెడ్డి స్మారక ప్రసంగం చేశారు. 2022-2023 దేశంలో నాటికి మొత్తం ఉపాధి రంగంలో 45.76 శాతం మంది వ్యవసాయంలోనే ఉద్యోగాలు పొందారని తెలిపారు. గత దశాబ్ద కాలంలో 11.2 కోట్ల మందికి ఈ రంగంలో ఉపాధి కలిగిందన్నారు.  


పెన్షనర్లకు న్యాయం చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా పెన్షనర్ల సమస్యలు అలానే ఉన్నాయని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్‌ అధికారుల సంఘం పేర్కొంది. అధ్యక్షుడు ఎం. మోహన్‌నారాయణ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగదు రహిత ఆరోగ్య పథకం సరిగా అమలు గాక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కల్పించేందుకు ఆదేశాలివ్వాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు