హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌, మేడిపల్లి పోలీసుస్టేషన్‌లలో మార్చి 27న నమోదు చేసిన కేసుల్లో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌ సహా ఆరుగురిని ఈనెల 11వరకు అరెస్ట్‌ చేయరాదంటూ హైకోర్టు బుధవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 04 Apr 2024 04:07 IST

చెంగిచెర్ల ఘటనలో 11 వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌, మేడిపల్లి పోలీసుస్టేషన్‌లలో మార్చి 27న నమోదు చేసిన కేసుల్లో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌ సహా ఆరుగురిని ఈనెల 11వరకు అరెస్ట్‌ చేయరాదంటూ హైకోర్టు బుధవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ విచారించాలనుకుంటే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఉప్పల్‌, మేడిపల్లి ఠాణాల్లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ బండి సంజయ్‌, మరో అయిదుగురు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మార్చి 27న హోలీ సందర్భంగా పిట్టలబస్తీ, చెంగిచెర్లలో జరిగిన గొడవలో బాధితులను పరామర్శించడానికి సంజయ్‌ సహా మరికొందరు వెళ్లారన్నారు. బారికేడ్లను పడదోశారని, పోలీసుల విధులకు అడ్డుపడ్డారంటూ తప్పుడు కేసు పెట్టారని వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. బండి సంజయ్‌తో సహా పిటిషనర్లను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 11వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని