కన్సల్టెన్సీ సంస్థలతో డ్యాం సేఫ్టీ కమిటీ భేటీ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ సంస్థలతో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సమావేశమైంది.

Updated : 04 Apr 2024 04:04 IST

‘మేడిగడ్డ’ కుంగిపోవడంపై చర్చ!

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ సంస్థలతో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సమావేశమైంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్స్‌ దెబ్బతిన్న నేపథ్యంలో పార్సన్‌ కన్సల్టెన్సీ సంస్థతో ఇన్వెస్టిగేషన్‌ చేయించారు. కుంగిన ఏడో బ్లాక్‌తోపాటు 6, 8వ బ్లాక్‌లలో పరిస్థితిని అంచనా వేయడానికి, ర్యాఫ్ట్‌ దిగువ నుంచి నీటి ప్రవాహం ఏ మేరకు వెళ్లింది.. ఎంత గ్యాప్‌ ఉంది.. తదితర అంశాలను తెలుసుకోవడానికి ఈ సంస్థతో నీటిపారుదల శాఖ అధ్యయనం చేయించింది. అన్నారం బ్యారేజీలో పరిస్థితిని కూడా పార్సన్‌ అధ్యయనం చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలోని కమిటీ పార్సన్‌ సంస్థ ప్రతినిధులతో బుధవారం దిల్లీలో సమావేశమైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. బ్యారేజీ కుంగడానికి ప్రధాన కారణం ఏమిటనే దానిపై ఎక్కువగా చర్చించినట్లు తెలిసింది. ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్‌ దశ నుంచి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయడం వరకు కీలకంగా వ్యవహరించిన కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌తో కూడా సమావేశం జరిగినట్లు సమాచారం.

అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం ఎస్‌ఈగా విజయకుమార్‌

అంతర్రాష్ట్ర జల వనరుల విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా ఉన్న విజయకుమార్‌కు ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు ఎస్‌ఈగా బాధ్యతలు నిర్వహించిన కోటేశ్వరరావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో విజయకుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. పదవీ విరమణ చేసిన కోటేశ్వరరావు అంతర్రాష్ట్ర జలవనరుల విభాగంలో సుదీర్ఘకాలం పని చేశారు. కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట వాదనల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, పునర్విభజన తర్వాత తెలంగాణలోనూ కీలకంగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని