హార్డ్‌డిస్కుల నుంచి ఆధారాలెలా?

సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల నుంచి ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది.

Updated : 04 Apr 2024 08:14 IST

మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
ట్యాపింగ్‌ దర్యాప్తునకు ఆటంకాలు

ఈనాడు, హైదరాబాద్‌ : సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల నుంచి ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది. చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు ప్రణీత్‌రావు ముఠా హార్డ్‌డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయడంతో వీటి నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం కష్టంగా మారింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ)లో హార్డ్‌డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనే పంజాగుట్టలో తొలుత కేసు నమోదైంది. వీటిని ఎందుకు ధ్వంసం చేశారని విచారించినప్పుడు ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రణీత్‌రావు తదితరులు అప్పటి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది.

ఎవరెవరి ఫోన్లు, ఎప్పుడెప్పుడు ట్యాప్‌ చేశారు, ఏమి రికార్డు చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి పంపారు వంటి వివరాలన్నీ ఈ హార్డ్‌డిస్కుల్లో ఉంటాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే డిసెంబరు 4వ తేదీన ప్రణీత్‌రావు ఎస్‌ఐబీ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు ఆపివేయించి, కంప్యూటర్లలో ఉన్న హార్డ్‌డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు బయటకు తీయించాడు. వాటిని మెటల్‌ కట్టర్లతో కత్తిరించి, నాగోలు వద్ద మూసీ నదిలో పడేశాడు. దస్త్రాలు, ఇతర పత్రాలను ఎస్‌ఐబీ కార్యాలయం ఆవరణలోనే తగులబెట్టాడు. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు మూసీ నుంచి తొమ్మిది హార్డ్‌డిస్కులకు సంబంధించిన శకలాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులెవరైనా హార్డ్‌డిస్కుల్లో సమాచారాన్ని చెరిపివేసినా.. సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు దాన్ని పునరుద్ధరించగలరు.

కొద్దిపాటి తేమ ఉంటేనే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు చెడిపోతాయి. అలాంటిది మూసీ బురదలో కూరుకుపోయిన హార్డ్‌డిస్కుల నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం ఎలా అన్నది సంక్లిష్టంగా మారింది. సెల్‌ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలు, చాటింగ్‌ వంటివాటిని ఆయా సర్వీస్‌ ప్రొవైడర్ల సర్వర్ల నుంచి పొందే అవకాశం ఉంటుంది. కాని పూర్తి అనధికారికంగా జరిగిన ట్యాపింగ్‌ తతంగం అంతా ఈ హార్డ్‌డిస్కుల్లో తప్ప మరెక్కడా నిల్వ ఉండే అవకాశం లేదు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ వీటి నుంచి సమాచారం రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సైబర్‌భద్రతా నిపుణులను సంప్రదిస్తున్నారు. అవసరమైతే వీటిని విదేశాలకైనా పంపాలని యోచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని