అంతరిక్ష యాత్రల్లో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం

భారత్‌ భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు.

Updated : 04 Apr 2024 05:29 IST

మున్ముందు ప్రతి మనిషికో ఐపీ నంబరు
ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. అందుకు 2040దాకా ఆగాల్సిన పనిలేదని.. కొన్నేళ్లలో ఇది సాకారమవుతుందని చెప్పారు. మొట్టమొదటి అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు వ్యోమగాములుగా టెస్ట్‌ పైలట్స్‌ను ఎంపిక చేశామని.. మున్ముందు చేపట్టే మిషన్లలో పైలట్లే కాకుండా శాస్త్రవేత్తలే వెళ్లి పరిశోధనలు చేస్తారని తెలిపారు. కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ ఎక్సలెన్సీ(కేఐవైఈ) గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఇన్‌స్పైర్‌-హైదరాబాద్‌ కార్యక్రమానికి సోమనాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగరంలోని పాఠశాల, కళాశాలల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. వారు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. స్పేస్‌ ఎకానమీలో 70శాతం ఆదాయం అప్లికేషన్స్‌ నుంచే వస్తోంది.. మొబైల్‌ కమ్యూనికేషన్స్‌, రిమోట్‌ సెన్సింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ వరకు చాలా సేవలున్నాయని చెప్పారు. ప్రతి మనిషికి ఆధార్‌ ఉన్నట్లే.. మున్ముందు ఐపీ నంబరు ఉండే అవకాశముందన్నారు. ఒకవ్యక్తి తమిళ్‌లో మాట్లాడుతుంటే వెంటనే అనువాదం చేసి తెలుగులో వినిపించే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఏఐ రాకతో విద్య, నైపుణ్యాలు, పనివిధానాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదివరకు ఆటోమొబైల్‌ అంటే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు ప్రతి కారులో 30-40 చిప్‌ల అమరికతో ఎలక్ట్రానిక్స్‌ పాత్ర పెరిగిందన్నారు.

రూ. 21వేల కోట్ల ఎగుమతులు

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది  మార్చి 31నాటికి భారత్‌ రూ.21వేల కోట్ల విలువైన ఉత్పత్తులను 58 దేశాలకు ఎగుమతి చేసిందని చెప్పారు. గ్రీన్‌ ప్రొపెల్షన్‌, కాంపోజిట్‌ రాకెట్‌ మోటార్స్‌ వంటి క్లిష్టమైన సాంకేతికత అభివృద్ధిలో అంకుర సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయని వివరించారు. త్వరలో కలాం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కేఐవైఈ అధ్యక్షుడు నరేశ్‌ ఇండియన్‌ తెలిపారు. సమావేశంలో ఆర్మీ దక్షిణాది జీవోసీ, లెఫ్టినెంట్‌ జనరల్‌ కరన్‌బీర్‌సింగ్‌, నిమ్స్‌మే డైరెక్టర్‌ జనరల్‌ డా.ఎస్‌.గ్లోరి స్వరూప, డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్‌ జి.రాజాసింగ్‌ మాట్లాడారు. అంకుర సంస్థలు ధ్రువ స్పేస్‌ వ్యవస్థాపకులు సంజయ్‌, కాన్‌స్టెల్లీ సీటీవో సీహెచ్‌ అవినాశ్‌రెడ్డి, సీఎస్‌సీసీ ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు చంద్రశేఖర్‌రెడ్డి తమ స్ఫూర్తిగాథలను విద్యార్థులతో పంచుకున్నారు. డీఆర్‌డీవో యంగ్‌సైంటిస్ట్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌ డా.పి.శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని