ప్రతి గింజనూ కొంటాం

ధాన్యం సేకరణకు ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ ఉంది. రైతులు అమ్మిన ధాన్యం తూకం, గ్రేడింగ్‌ను కొనుగోలు కేంద్రంలో సిబ్బందే వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించాం.

Updated : 04 Apr 2024 03:33 IST

48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు
ధాన్యం లెక్కలు వెంటనే ఆన్‌లైన్‌లో
పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రానివ్వకుండా 56 చెక్‌పోస్టులు
‘ఈనాడు’తో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌
ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1967, 180042500333


ధాన్యం సేకరణకు ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ ఉంది. రైతులు అమ్మిన ధాన్యం తూకం, గ్రేడింగ్‌ను కొనుగోలు కేంద్రంలో సిబ్బందే వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించాం. ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు లేకుంటే.. తూకాన్ని తగ్గించే అధికారం డిప్యూటీ తహసీల్దార్‌, జిల్లా పౌరసరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులకు మాత్రమే ఉంటుంది.

 డీఎస్‌ చౌహాన్‌


ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం జరగనివ్వబోమని.. కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో 56 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. యాసంగి వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై ‘ఈనాడు’ ఆయనతో మాట్లాడింది.

ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించగా.. తాము తీసుకోబోయే చర్యలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

  • వరి కోతలు మొదలైన ప్రాంతాల్లో మార్చి 25 నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ఇప్పటికే 3134 కేంద్రాలు ప్రారంభించి.. 2980 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిగిలిన చోట్ల దశలవారీగా తెరుస్తున్నాం. ఏప్రిల్‌ 5 నాటికి అన్ని కేంద్రాలూ అందుబాటులోకి వస్తాయి. గత యాసంగిలో 7307 కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. ఈసారి ఆ సంఖ్యను 7149కి పెంచుతున్నాం. గత సీజన్‌లో 66.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈసారి లక్ష్యాన్ని 75.4 లక్షల టన్నులకు పెంచాం. ఇంకా అదనంగా ఎంత ధాన్యం వచ్చినా.. కొనుగోలు చేస్తాం. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం.. గ్రేడ్‌ ఏ రకానికి  రూ.2203, సాధారణ రకానికి రూ.2183 చెల్లిస్తాం. రైతులు బయట కూడా ఇంతకంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనవద్దని రైస్‌మిల్లర్లను ఆదేశించాం. వరికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. యాసంగి సీజన్‌ ప్రారంభానికి ముందే ఎన్నికల కోడ్‌ వచ్చింది.
  • కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు అందుబాటులో ఉంటుంది. ఎండ ప్రభావం లేకుండా నీడ ఏర్పాట్లు చేస్తున్నాం. గత ఎండాకాలం మాదిరిగా ఈసారి వేసవిలో అకాల వర్షాలు కురుస్తాయన్న అంచనాలు లేవు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాలతో నష్టం జరిగే అవకాశం లేదు. గోనె సంచులు, టార్పాలిన్‌ కవర్లు తగినన్ని ఉంటాయి. కొనుగోలు కేంద్రాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చాం.
  • రైతులు తమ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల మేరకు తీసుకురావాలి. తేమ శాతం గరిష్ఠంగా 17 శాతం దాటొద్దు. చెత్త, తాలు, మట్టిబెడ్డలు, రాళ్లు, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో నిబంధనలు పాటిస్తే కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిబంధనలు, నాణ్యత ప్రమాణాల్ని వివరించే పోస్టర్లను కేంద్రాల దగ్గర  పెడుతున్నాం.
  • రైతులు అమ్మిన ధాన్యంలో కోత పెట్టే అధికారం మిల్లర్లకు లేదు. అలా చేస్తే సహించేది లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతు మోసపోకుండా టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాం. కనీస మద్దతు ధర, ఇతర ఫిర్యాదుల కోసం 1967, 180042500333 నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు.
  • మిల్లుల దగ్గర ధాన్యం అన్‌లోడింగ్‌లో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం ఉండదు. యాసంగి ధాన్యంలో 50 శాతం కొనుగోళ్లు ఒక్క మే నెలలోనే జరుగుతాయి. రైతులంతా ఒకేసారి కేంద్రాలకు వస్తే కొంత ఆలస్యం కావచ్చు. ఇలాంటి అంశాల్లో శాఖాపరంగా పర్యవేక్షించి జాప్యాన్ని తగ్గిస్తాం.
  • మిల్లర్లు తీసుకున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడంలో (సీఎంఆర్‌) ఈసారి జాప్యం చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ రవాణా నివారణకు రాష్ట్ర సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం డబ్బుల్ని రైతుల ఖాతాల్లో 24 గంటల్లోగా వేయాలన్నది మా లక్ష్యం. గరిష్ఠంగా 48 గంటల్లో వేస్తాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని