టెలిగ్రాఫ్‌ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు

తెలంగాణలో టెలిగ్రాఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ స్పష్టంచేశారు.

Updated : 04 Apr 2024 06:51 IST

ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌
ఏపీ అభివృద్ధికే తెదేపా, జనసేనలతో కూటమని వెల్లడి

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో టెలిగ్రాఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ స్పష్టంచేశారు. ఎవరి ఫోన్‌నైనా ట్యాప్‌ చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధవారం దిల్లీలోని తన నివాసంలో ప్రాంతీయ పత్రికల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పరిస్థితులపైనా స్పందించారు. ‘‘దక్షిణాదిలో ఈసారి ఎన్డీయే ఇప్పటివరకూ లేనంత గరిష్ఠ సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. తెలంగాణలో రెండంకెల సంఖ్యలో గెలుచుకోబోతున్నాం. గత భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా చేసిన పోరాటమే అందుకు కారణం. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భాజపా ఒక్కటే. దానివల్లే మా ఓటు బ్యాంకు 7% నుంచి 14%కి పెరిగింది. రాష్ట్రానికి మేలు జరగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి, భాజపాకు ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. రైలు, రోడ్డు ప్రాజెక్టులు చాలా ఇచ్చాం. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇవ్వడానికి గత కేసీఆర్‌ ప్రభుత్వం ఆరేళ్లు స్పందించకపోవడం వల్లే ఆలస్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పునకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేయకూడదు.

8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలం?

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మా పార్టీ నాయకులెవరూ అనలేదు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 61 మంది ఎమ్మెల్యేలు కావాలి. మాకు 8 మంది మాత్రమే ఉన్నారు. ఇంతమందితోనే ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలుగుతాం. భాజపా, భారాసలు కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. బురదచల్లడం కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య. ఇదివరకు కవితను అరెస్ట్‌ చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు అరెస్ట్‌ చేస్తే ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక వాదనకు కట్టుబడి ఉండాలి తప్ప అటూ, ఇటూ మాట్లాడకూడదు.

భారాస.. ఫామ్‌హౌస్‌ పార్టీ

భారాస పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న నేతలు వదిలిపోతున్నారు. దాన్ని మేం ఏదో చేయాల్సిన అవసరమే లేదు. భారాసను వదిలినవారు భాజపాలోకే రావడం లేదు. కాంగ్రెస్‌లోనూ చేరుతున్నారు. భారాస ఒక కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌ పార్టీ. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఆఫీసుకే రాకపోతే ఫామ్‌హౌస్‌ వరకు ఎంతమంది పోగలుగుతారు? ఆ బాధను భరించలేకే ఆ పార్టీ నాయకులు వీడిపోతున్నారు.

ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు..

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సమయం నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు చంద్రబాబునాయుడుతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. కూటమి రెండుసార్లు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో భాజపాతో పొత్తు లేకపోతే కూటమి అసంపూర్తిగా ఉంటుందని, కలిసి పోటీ చేస్తే మరింత శక్తిమంతంగా తయారవుతుందని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ భావించి ఉండొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జగన్‌ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన మౌలిక వసతులు కల్పించలేదు. పరిశ్రమలూ తీసుకురాలేదు. గుజరాత్‌ తర్వాత సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వైకాపా ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది. రూ.వేల కోట్ల అప్పులు చేసి ఏపీని పూర్తిగా అప్పుల ఊబిలోకి తోసింది. అప్పులకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేయలేరు. కొవిడ్‌ సమయంలో అన్ని రాష్ట్రాలకూ అప్పుల పరిధిని 3% నుంచి 3.5%కి పెంచాం. వివిధ షరతులకు లోబడి అదనపు రుణాలు తీసుకోవడానికీ అన్ని రాష్ట్రాలకూ కేంద్రం అవకాశం ఇచ్చింది. సంస్కరణల ఆధారంగా ప్రోత్సాహకాలు అందించింది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించలేదు.

ఏపీ అభివృద్ధికోసం ఎన్డీయేకు ఓటేయండి

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే భాజపా, తెదేపా, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమికి ఓటేయాలని పిలుపునిస్తున్నా. ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తం సాయం చేస్తామని ఇదివరకే చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌ను ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయలేదు. దేశంలో మూడు రాష్ట్రాలకు బల్క్‌డ్రగ్‌ పార్కులు కేటాయిస్తే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చాం. నాలుగింటిలో ఒక మెడికల్‌ డివైజ్‌ పార్క్‌నూ ఇచ్చాం. విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలన్నీ మంజూరు చేసి నిర్మించాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన డబ్బులన్నీ ఇచ్చాం. వై.ఎస్‌.షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఆమె వ్యక్తిగత నిర్ణయం. భాజపాలో చేరాలని ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదు’’ అని అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని