నీటి ఎద్దడి లేకుండా..

వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించి, బాధ్యతలు అప్పగించింది.

Published : 04 Apr 2024 03:06 IST

తక్షణ కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక
మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్‌లు
రేపు ‘దిగువ మానేరు’కు నీటి విడుదల
పురపాలికలకు రూ.30 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించి, బాధ్యతలు అప్పగించింది. తక్షణం కార్యాచరణకు దిగాలని వారికి స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని పురపాలికల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలను రూపొందించింది.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు వెంటనే రూ.30 కోట్ల విడుదలకు నిర్ణయించింది. అవసరాలకు అనుగుణంగా.. జలాశయాలకు నీటి విడుదల, ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా, బోరుబావుల వినియోగం తదితర చర్యలకు కార్యాచరణ చేపట్టింది.

తక్షణం నిధులు..

గత ఆరు నెలలుగా వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటింది. భూగర్భ జలాలు సైతం తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పలు పురపాలికల పరిధిలో తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో తాగునీటికి సమస్యలు ఎదురుకాకుండా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. మంచినీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. నిరుపయోగంగా ఉన్న బోర్లలోని పూడిక తీయాలని, సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేయాలని తెలిపింది. నిధుల కొరత లేకుండా 12 మున్సిపల్‌ కార్పొరేషన్లకు రూ.7 కోట్లు, 130 మున్సిపాలిటీలకు రూ.23 కోట్లను తక్షణం విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.

రిజర్వాయర్లకు నీళ్లు..

పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు పలు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల రిజర్వాయర్లను నీటితో నింపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఖమ్మం, నల్గొండ పట్టణాల్లో నీటిఎద్దడి నివారణకు గాను పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్లకు సోమవారమే నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేశారు. కరీంనగర్‌ ప్రజల దాహార్తిని తీర్చేందుకు దిగువ మానేరు డ్యామ్‌కు మిడ్‌ మానేరు డ్యామ్‌ నుంచి శుక్రవారం నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.

30 వేల బోర్ల ద్వారా..

రాష్ట్రంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పవర్‌ బోర్లు, బోరు బావులు 30 వేల వరకు ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. వాటి నుంచి అన్ని పట్టణాలకూ తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బోర్లు, బోరు బావులను గుర్తించి వేసవి మూడు నెలల కాలానికి అద్దెకు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పురపాలికల్లో కలిపి 300 వరకు నీటి సరఫరా ట్యాంకర్లు ఉన్నాయి. వీటిద్వారా నీటి సరఫరా చేయాలని.. అవసరమైతే కావాల్సినన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ట్యాంకరు ద్వారా నీటికి ప్రజల నుంచి వినతులు వచ్చిన 12 గంటల్లోగా సరఫరా చేసేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.

వెంటనే జిల్లాలకు ప్రత్యేక అధికారులు..

రాష్ట్రంలో జిల్లాలవారీగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా అధికారులు తమకు కేటాయించిన జిల్లాలను వెంటనే సందర్శించాలని, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల సమన్వయంతో తాగునీటి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వచ్చే జులై నెలాఖరు వరకూ ప్రతి రోజూ అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ అధికారులు వచ్చే రెండు నెలల పాటు సెలవులు పెట్టవద్దని, ఆ సమయంలో మంచినీటి సరఫరాకు అవసరమైన చర్యలపైనే దృష్టి సారించాలని సూచించారు. సీఎస్‌ ఆదేశాల మేరకు ఆయా అధికారులు బుధవారమే జిల్లాలకు బయల్దేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని