పాడె మోసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు, సీఎం నివాళులు

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌రతన్‌కు కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు అశ్రునయనాల మధ్య తుదివీడ్కోలు పలికారు.

Updated : 11 Apr 2024 05:31 IST

అశ్రునయనాలతో రాజీవ్‌రతన్‌కు తుదివీడ్కోలు

ఈనాడు, హైదరాబాద్‌-రాయదుర్గం, మహేశ్వరం, న్యూస్‌టుడే: విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌రతన్‌కు కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు అశ్రునయనాల మధ్య తుదివీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మహాప్రస్థానంలో బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు నివాళులర్పించారు. కుమారుడు హరి తండ్రి పార్థివదేహానికి తలకొరివి పెట్టారు. అంతకుముందు అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరుకున్నాక డీజీపీలు రవిగుప్తా, సీవీ ఆనంద్‌, టీఎస్‌న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు పాడె మోశారు. మాజీ డీజీపీలు మహేందర్‌రెడ్డి, ఆర్‌.పి.ఠాకూర్‌, గోవింద్‌సింగ్‌, పలువురు సీనియర్‌ ఐపీఎస్‌, విశ్రాంత అధికారులు నివాళులర్పించారు. అంతకుమునుపు మహేశ్వరం మండలం తుమ్మలూరులోని ఆయన నివాసం వద్ద పార్థివదేహానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నివాళులర్పించారు.  

సీనియర్‌ ఐపీఎస్‌, బ్యాచ్‌మేట్‌ రాజీవ్‌రతన్‌ హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని డీజీపీ రవిగుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌రతన్‌తో తనకున్న అనుబంధాన్ని ఐపీఎస్‌ల వాట్సప్‌ గ్రూప్‌లో పంచుకున్నారు. ‘రాజీవ్‌ కేవలం సహోద్యోగి లేదా స్నేహితుడు మాత్రమే కాదు. ఒక మహోన్నత వ్యక్తిత్వం గలవారు.  తాను సరైనది అని ఒకసారి నమ్మితే చాలు ఎన్నడూ రాజీ పడలేదు. రాజీవ్‌ జ్ఞాపకాలు మా హృదయాల్లో నిలిచి ఉంటాయి..’అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని