రెండు పల్లెల మల్లెలరాగం..

ఆ గ్రామాల మీదుగా వెళ్తుంటే మల్లెల సువాసనలు మైమరిపింపజేస్తాయి. అలా అని అక్కడ పూల మార్కెట్‌ లేదు. ప్రతి ఇంటికి ఒక మల్లెపూల తోట ఉంటుంది. అవే ఆ రెండు పల్లెల మహిళలకు ఉపాధిమార్గంగా మారాయి.

Published : 11 Apr 2024 05:30 IST

పూలసాగుతో వేసవిలో మహిళలకు ఉపాధి
మంచిర్యాల జిల్లాలోని బోయపల్లి, బర్లగూడెం ఆదర్శం

తాండూరు, న్యూస్‌టుడే: ఆ గ్రామాల మీదుగా వెళ్తుంటే మల్లెల సువాసనలు మైమరిపింపజేస్తాయి. అలా అని అక్కడ పూల మార్కెట్‌ లేదు. ప్రతి ఇంటికి ఒక మల్లెపూల తోట ఉంటుంది. అవే ఆ రెండు పల్లెల మహిళలకు ఉపాధిమార్గంగా మారాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని బోయపల్లి, బర్లగూడెం గ్రామాల అతివలు పూలసాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాండూరు మండలం బోయపల్లి, బర్లగూడెం గ్రామాలు పూలకు పెట్టింది పేరు. బోయపల్లిలోని 304 నివాసాలకుగాను 160 నివాసాల్లో, బర్లగూడెంలో 20 ఇళ్లు ఉండగా... ప్రతి ఇంటి ఆవరణలోనూ 5 నుంచి 20 గుంటల విస్తీర్ణంలో మొత్తంగా రెండు గ్రామాల్లో 70 ఎకరాల్లో మల్లె తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రతి ఇంటి వారు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నర్సరీల నుంచి మల్లె, కనకాంబరం, గులాబీ మొక్కలు తెప్పించి నాటుకుంటున్నారు. వాటి సస్యరక్షణ బాధ్యతలన్నీ గృహిణులే చూసుకుంటారు. వీటి ద్వారా ఇంటి వద్దే సీజనల్‌గా ఆదాయం పొందటంతోపాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.

వేసవి వచ్చిందంటే చాలు ఉదయం 6 గంటల నుంచి పూల తోటల్లో కూలీలు, 9 గంటల నుంచి వీధుల్లో పూల వ్యాపారుల హడావుడి కనిపిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ‘‘వివాహాలు, ఇతరత్రా శుభకార్యాల సీజన్‌లలో బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి పూల వ్యాపారులు గ్రామానికే వచ్చి కొనుగోలు చేస్తారు. వాటిని మంచిర్యాల జిల్లాతో పాటు కుమురంభీం, మహారాష్ట్రలలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. సీజన్‌ను బట్టి కిలో మల్లె మొగ్గలకు రూ.100 నుంచి రూ.500 వరకు ధర చెల్లిస్తారు’’ అని సాగుదారుల్లో ఒకరైన బర్లగూడెం గ్రామానికి చెందిన దాడి నీల  పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు ఇంటి వద్ద ఉన్న 12 గుంటల విస్తీర్ణంలో 6 ఏళ్లుగా మల్లెతోట సాగు చేస్తున్నానని, ఏటా అయిదు నెలల్లో సుమారు రూ.50 వేల ఆదాయం వస్తోందని తెలిపారు. కిలో మొగ్గలు తెంపితే కూలీలకు రూ.40 నుంచి రూ.60 వరకూ ఇస్తామని, ఇలా రెండు గ్రామాల్లో కలిపి పదుల సంఖ్యలో కూలీలు ఏడాదిలో ఐదారు నెలలపాటు ఉపాధి పొందుతున్నారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని